కాళ్లూ చేతులు కట్టేసి మహిళ దారుణ హత్య | Brutal murder of woman | Sakshi
Sakshi News home page

కాళ్లూ చేతులు కట్టేసి మహిళ దారుణ హత్య

Published Thu, Oct 16 2014 12:14 AM | Last Updated on Thu, Aug 2 2018 4:53 PM

లక్ష్మీ తులసి - Sakshi

లక్ష్మీ తులసి

  • కాళ్లూ చేతులు కట్టేసి మహిళ దారుణ హత్య
  •  60 తులాల బంగారం అపహరణ
  • లంగర్‌హౌస్: దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కాళ్లు, చేతులు కట్టేసి కిరాతకంగా హత్య చేశారు. ఇళ్లంతా లూఠీ చేశారు. 60 తులాల బంగారు నగలు, ఒకటిన్నర కిలోల వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దోచుకుపోయారు. ఈ దారుణ సంఘటన బుధవారం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

    పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు జిల్లాకు చెందిన సత్యనారాయణ, లక్ష్మీ తులసి దంపతులు నగరంలోని లంగర్‌హౌస్ ఓంనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె అమెరికాలో, మరో కుమార్తె బాచ్‌పల్లిలో ఉంటున్నారు. సత్యనారాయణ కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ఫ్రొఫెసర్‌గా పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత బంజారహిల్స్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో లైబ్రేరియన్‌గా పని చేస్తున్నారు. ఆయన బుధవారం ఉదయం 10 గంటలకు విధులకువెళ్లి తిరిగి సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు.

    ఇంటి ప్రధాన ద్వారం బయట గడియ పెట్టి ఉండడంతో తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్లారు. ల్యాప్‌టాప్, ఐప్యాడ్ కనిపించలేదు. లోపల గదుల్లోకి వె ళ్లి పరిశీలించగా, బీరువా విరగ్గొట్టి ఉండడంతో పాటు వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. రక్తం మడుగులో ఉన్న భార్యను చూసి హతాశులయ్యారు. దుండగులు లక్ష్మీతులసి కాళ్లు, చేతులను దుస్తులతో కట్టివేసి దారుణంగా హత్యచేశారు. తలపై బలమైన గాయాలయ్యాయి. మెడ, గొంతుపై కత్తి గాట్లు ఉన్నాయి. ఆమె ఛాతి, కడుపులో కత్తితో పొడిచారు.
     
    భారీ దోపిడీ    

    ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మీతులసిని హత్య చేసిన దుండగులు బీరువాలోని 60 తులాల బంగారు, ఒకటిన్నర కిలోల వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. ఖరీదైన ల్యాప్‌టాప్, ఐపాడ్‌లతో పాటు విలువైన వస్తువులు, నగదును ఎత్తుకెళ్లినట్లు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన తీరును పరిశీలిస్తే దుండగులు ఇంట్లో చాలా సమయం గడిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    మృతురాలి ఒంటిపై ఉన్న నగలు మాత్రం అలాగే ఉండడం గమనార్హం. హత్య, దోపిడీకి పాల్పడింది తెలిసిన వారిపనేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. జనవరి నెలలోనూ   వీరి ఇంట్లో దొంగతనం జరిగింది. అప్పుడు లక్ష్మీతులసి టీవీ చూస్తుండగా ఆ గదికి గడియ పెట్టిన దొంగలు ఇంట్లోని డాలర్లు, విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సంఘటన తర్వాత ఇంటికి ఎవరు వచ్చినా తెలిసిన వారు అయితేనే తలుపులు తెరిచే వారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.

    మధ్యాహ్నం మంచి నీరు పట్టుకోవడానికి మాత్రమే ఆమె బయటికి వ చ్చేదని అంటున్నారు. సంఘటనకు ముందు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో స్థానికులతో మాట్లాడిందని తెలిసింది. సమయం చూసుకుని దుండగులు ఈ దురాగతానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దుండగులు పక్కాగా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. నాలుగు రోజులు కిందట ఓ మహిళ వీరి ఇంటి ప్రాంగణంలోని ప్రహరీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు నిలదీశారు.

    తన పేరు సుల్తానా అని, సత్యనారాయణ ఇంట్లో పనిమనిషిగా చేరానని చెప్పి వెళ్లి పోయింది. బుధవారం మధ్యాహ్నం నలుగురు వ్యక్తులు ఇద్దరిద్దరుగా కాలనీలో సంచరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొత్తగా కనిపించిన ఇద్దరిని అడుగగా తమకు ఒక ఇంటి చిరునామా కావాలంటూ వెళ్లిపోగా, మరో ఇద్దరు విద్యుత్ శాఖ నుంచి వచ్చామని తెలిపారు.  రెండు నెలల కిందట పనిమనిషి మానేసిందని, తర్వాత ఎవరినీ నియమించలేదని సత్యనారాయణ తెలిపారు.

    దీంతో నాలుగు రోజులు కిందట సంచరించిన మహిళతో పాటు, ఈ రోజు వీధిలో అనుమానంగా సంచరించిన వారిపై  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ మండల డీసీపీ సత్యనారాయణ, సీసీఎస్ డీసీపీ పాల్, అదనపు డీసీపీ కె.ఆర్.నాగరాజు, ఆసిఫ్‌నగర్ ఏసీపీ డి.శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ ఎన్.బి.రత్నం సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. క్లూస్‌టీం రంగంలోకి దిగి ఆధారాలను సేకరించింది. డాగ్ స్క్వాడ్‌ను తీసుకురాగా ఇంటి పరిసరాల్లో పలుమార్లు తిరిగి ఆ ఇంట్లోకే వెళ్లింది.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement