- జలాల్‌పురంలో ‘బీఎస్‌ఎఫ్’ స్థల పరిశీలన
- అడ్డుకున్న రైతులు, అధికారులతో వాగ్వాదం
భూదాన్‌పోచంపల్లి: ‘‘తాత, ముత్తాతల కాలం నుంచి ఈడనే సేద్యం చేసుకుంటున్నం.. ఏళ్లుగా కబ్జాలో ఉంటున్న ప్రభుత్వ భూమిని మాకే కేటాయించాలి.. ఇంకేవరికో కేటాయిస్తమంటే ఊరుకునేది లేదు.. అవసరమైతే ఈడనే ఉరేసుకుంటం.. కానీ జాగా మాత్రం ఖాళీ చెయ్యం’’ అని మండలంలోని జలాల్‌పురం గ్రామ రైతులు స్పష్టం చేశారు. గ్రామంలోని 80వ సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కాలనీ నిర్మాణం కోసం శుక్రవారం బీఎస్‌ఎఫ్ అధికారులు స్థల పరిశీలన చేశారు. అయితే విషయం తెలుసుకున్న అదే భూమిలోఅరవై ఏళ్లుగా కబ్జాలో ఉన్న రైతులతో పాటు సర్పంచ్ శాపాక భిక్షపతి, ఉపసర్పంచ్ పాలకూర్ల ఆగయ్యలు సంఘటన స్థలానికి చేరుకుని బీఎస్‌ఎఫ్ అధికారులను అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. దాంతో బీఎస్‌ఎఫ్ అధికారులు వెంటనే అక్కడి నుంచి వెళ్లి తహసీల్దార్ ఎం.విజయకుమారితో సమావేశమయ్యారు.
స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి అనువుగా ఉందని, 50 ఎకరాల పైన ఇస్తే బీఎస్‌ఎఫ్ కుటుంబాల కోసం కాలనీ నిర్మాణంతో పాటు సైనిక పాఠశాల, ఆస్పత్రి నిర్మాణం చేపడతామని సరిహద్దు దళాల(బీఎస్‌ఎఫ్) డీఐజీ సుమేర్‌సింగ్ తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే స్థల కేటాయింపు మా పరిధిలో లేదని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు నివేదిస్తామని ఆమె పేర్కొన్నారు. అదీకాక రైతులు ఈ స్థల విషయమై కోర్డులో పిటిషన్ కూడా వేశారని తెలిపారు. డీఐజీ స్పందిస్తూ కలెక్టర్‌తో గతంలోనే మాట్లాడామని చెప్పారు. రైతులకు నష్టం కలుగకుండా వారికి నష్టపరిహారం కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అందరి దృష్టి సర్వే నంబర్ 80 పైనే..
జలాల్‌పురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 80లో గల ప్రభుత్వ భూమిపైన అందరి దృష్టిపడింది. ఈ సర్వే నంబర్‌లో 110 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే చాలా కాలంగా గ్రామానికి చెందిన రైతులు ఆ ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉండి సేద్యం చేసుకుంటున్నారు. 2007లో ఇదే భూమిలో 80 ఎకరాలు ఇఫ్ల్యూ యూనివర్సిటీకి ఇచ్చారు. కానీ వారు నిర్మాణం చేపట్టకపోవడంతో దానిని రద్దు చేశారు. తరువాత అపార్డ్ అధికారులు చూసి వెళ్లారు. ఇటీవల చెత్త డంపింగ్ యార్డు కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు సర్వే కోసం వస్తే గ్రామస్తులు అడ్డుకోవడంతో వారూ వెనుదిరిగారు.
ఇప్పుడు బీఎస్‌ఎఫ్ అధికారులు స్థలపరిశీలన చేయడంతో గ్రామస్తులలో ఆందోళన మొదలైంది. ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని తమకు కాకుండా మరెవరికో ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. రైతులకు అసైన్డ్‌చేయాలని అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదని వారు వాపోతున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న భూదాన్‌పోచంపల్లి మండలంలో ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేయడం బ్యాన్‌లో ఉంది. ఇదిలా ఉంటే సర్వే నంబర్ 80లో గల 110 ఎకరాల భూమి ప్రభుత్వ రికార్డులో మాత్రం ఖాళీగా ఉంది.
ఉరేసుకుంటం కానీ.. జాగా ఖాళీ చెయ్యం ..!
Published Sat, Sep 20 2014 2:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement