సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ కొనుగోలు ధరల ‘రీ–ఫిక్సింగ్’వ్యవహారంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలపై అనవసరంగా రూ.వందల కోట్ల భారం పడిందని అక్షింతలు వేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ డిస్కంల యాజమాన్యాలకు కాగ్ లేఖ రాసినట్టు ఉన్నత స్థాయి అధికారవర్గాలు ధ్రువీకరించాయి.
గడువు పొడిగింపు.. ధరల రీ–ఫిక్సింగ్
తెలంగాణ ఏర్పడిన తర్వాత సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంపును రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు డిస్కంలు అప్పట్లో మూడు విడతలుగా టెండర్లను ఆహ్వానించాయి. ప్రైవేటు పెట్టుబడిదారులు (డెవలప ర్లు) ముందుకొచ్చి రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తే, వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని డిస్కంలు హామీ ఇస్తూ టెండర్లను నిర్వహించాయి. ఇలా 2014 లో 500 మెగావాట్లు, 2015లో 1,500 మెగావాట్లు, 2016లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు టెండర్లు నిర్వహించారు. మెగావాట్, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు, 30 మెగావాట్లు, 50 మెగావాట్లు, 100 మెగావాట్లు.. ఇలా వేర్వేరు ఉత్పాదక సామర్థ్యంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు డిస్కంలు వందల మంది డెవలపర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
చివరిసారిగా 2016లో రివర్స్ బిడ్డింగ్ విధానంలో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు జరగ్గా, ఓ కంపెనీ యూనిట్‌కు రూ.5.17 చొప్పున అత్యల్ప ధరతో విద్యుత్ విక్రయించేందుకు ముందుకొచ్చింది. ఈ టెండర్లలో సగటున యూనిట్‌కు రూ.5.84 ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు డెవలపర్లు బిడ్లు వేశారు. 12 నెలల్లోగా సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఒప్పందంలో డిస్కంలు గడువు విధించాయి. ఎక్కువ మంది డెవలపర్లు గడువులోగా సౌర విద్యుత్ ప్లాంట్లను నిర్మించలేకపోయారు. డెవలపర్ల విజ్ఞప్తి మేరకు అప్పట్లో డిస్కంలు గడువు పొడిగించాయి.
ఈ క్రమంలో విద్యుత్ ధరలను పునర్ నిర్ణయిస్తూ (రీఫిక్స్ చేస్తూ) ఆయా విద్యుత్ కేంద్రాల ఒప్పందాలను సవరించాయి. 2016లో నిర్వహించిన టెండర్లలో బిడ్లను దక్కించుకుని గడువులోగా నిర్మాణం పూర్తి కాని ప్లాంట్ల గడువును డిస్కంలు పొడిగించాయి. ఈ క్రమంలో వాటికి చెల్లించాల్సిన విద్యుత్ ధరలను కొంతవరకు తగ్గించాయి. 2016 టెండర్లలో నమోదైన సగటు విద్యుత్ కొనుగోలు ధర రూ.5.84ను ప్రామాణికంగా తీసుకుని, గడువులోగా నిర్మాణం పూర్తి కాని ప్రాజెక్టుల విద్యుత్ ధరను తగ్గించాయి. 2016 టెండర్లలో నమోదైన అత్య ల్ప విద్యుత్ కొనుగోలు ధర యూనిట్‌కు రూ.5.17ను ప్రామాణికంగా తీసుకుని ఆ మేరకు విద్యుత్ కొనుగోలు ధరలను తగ్గించాల్సి ఉండేదని, ఇలా చేయకపోవడంతో ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో రూ.వందల కోట్ల భారం పడబోతోందని కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
కేంద్రం కక్ష సాధింపే..
తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగం అద్భుత ప్రగతి సాధించిందని, దీన్ని ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సౌర విద్యుత్ ప్లాంట్ల గడువు పొడిగింపు సందర్భంగా వాటి నుంచి కొనుగోలు చేసే విద్యుత్ ధరలను తగ్గించడంతో రాష్ట్ర ప్రజలపై పడే విద్యుత్ చార్జీల భారం తగ్గిందని ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అయినా దీన్ని కూడా తప్పుబడుతూ కాగ్ లేఖ రాయడం వెనక కేంద్రం దురుద్దేశాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
సోలార్ ‘రీ–ఫిక్సింగ్’!
Published Sat, Feb 22 2020 1:44 AM | Last Updated on Sat, Feb 22 2020 1:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment