‘క్యాంప్’..సేఫ్!
మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయం దగ్గరపడటంతో జిల్లాలో ‘పుర’రాజకీయం మరింత వేడెక్కింది. కుర్చీ నీకా..నాకా! అనే రీతిలో శిబిరాల నిర్వహణ జోరందుకుంది. స్పష్టమైన సంఖ్యాబలం లేని పురపాలికల్లో పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు నేతలు, పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓ వైపు సొంతపార్టీ కౌన్సిలర్లు ‘చే’జారిపొకుండా విప్ అస్త్రాన్ని ప్రయోగిస్తూనే.. మరోవైపు చైర్మన్ పదవిని ఆశిస్తున్న కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు పార్టీనేతలు యత్నిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మునిసిపల్ చైర్మన్లు, వైస్‌చైర్మన్ల పరోక్ష ఎన్నికకు మరో 24 గంటల గడువు మాత్రమే ఉంది. దీంతో సొంత పార్టీలు జారిపోకుండా విప్ జారీచేసే పనిలో ఆయా పార్టీల నేతలు బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే పార్టీ కౌన్సిలర్లకు విప్ అందజేయడంతో మునిసిపల్ కమిషనర్లకు కూడా కలిసి విప్ వివరాలను అందజేస్తున్నారు. షాద్‌నగర్, గద్వాల మునిసిపాలిటీలు కాంగ్రెస్, నారాయణపేట బీజేపీ, అయిజ నగర పంచాయతీ చైర్మన్ పదవి టీఆర్‌ఎస్ ఖాతాలో చేరనుంది.
స్పష్టమైన సంఖ్యాబలం లేని మునిసిపాలిటీల్లో సొంతపార్టీ కౌన్సిలర్లు చేజారకుండా పార్టీలు విప్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. పార్టీ జారీచేసిన విప్ నోటీసును సభ్యులకు అందించే పనిలో పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికే పార్టీ కౌన్సిలర్లకు విప్ అందజేయడంతో మునిసిపల్ కమిషనర్లకు కూడా కలిసి విప్ వివరాలు అందజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ విప్ బాధ్యతలను అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు అప్పగించింది.
ఓ వైపు నోటీసులు జారీ చేస్తూనే మరోవైపు క్యాంపుల నిర్వహణలో అన్నిపార్టీలు నిమగ్నమయ్యాయి. వనపర్తి మునిసిపాలిటీ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా క్యాంపు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో ఓ స్వతంత్ర కౌన్సిలర్ కూడా ఈ శిబిరంలో ఉన్నట్లు సమాచారం. టీడీపీ కూడా పట్టు వీడకుండా మరోచోట క్యాంపు నిర్వహిస్తోంది. టీడీపీ తరఫున గెలిచిన వారితో పాటు నలుగురు స్వతంత్రులు, ఓ టీఆర్‌ఎస్ కౌన్సిలర్ కూడా క్యాంపునకు తరలివెళ్లాడు. ఎన్నిక సమయంలో మరో ఇద్దరు మద్దతు లభిస్తుందని టీడీపీ లెక్కలు వేస్తోంది.
పాలమూరులో పోటాపోటీ!
మహబూబ్‌నగర్ మునిసిపల్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కౌన్సిలర్లు హైదరాబాద్‌లో కాంగ్రెస్ శిబిరంలోకి చేరుకున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ కూడా ఎంఐఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో పాటు మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులతో క్యాంపు ఏర్పాటుచేసింది. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓటు కలుపుకుని టీఆర్‌ఎస్ సంఖ్యాబలం 21కి చేరింది. మరో ఇద్దరుసభ్యుల మద్దతు కోసం టీఆర్‌ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఓటింగ్‌కు గైర్హాజరు కావాలంటూ కాంగ్రెస్ సభ్యులకు ప్రలోభాలు ఎరగా చూపుతున్నట్లు సమాచారం.
- మరోవైపు కాంగ్రెస్ నుంచి రాధ అమర్, పద్మ గోపాల్, టీఆర్‌ఎస్ నుంచి వనజ వెంకటయ్య, బురుజు కల్పన చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఓ వైపు క్యాంపు నిర్వహిస్తూనే మరోవైపు పదవి ఆశిస్తున్న కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు పార్టీనేతలు ప్రయత్నిస్తున్నారు. కల్వకుర్తి నగర పంచాయతీ పరిధిలో ఏ పార్టీ కూడా క్యాంపు నిర్వహణపై దృష్టి సారించలేదు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ చైర్మన్ పీఠం కోసం గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంఐఎం మద్దతు కూడగట్టిన టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్‌ఆర్ సీపీ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.