కేన్సర్ జాకెట్
సాక్షి, హైదరాబాద్: కేన్సర్.. మనుషులను కబళిస్తున్న మహమ్మారి. ముఖ్యంగా మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్ ఇందులో అగ్రభాగంలో ఉంది. ముందస్తు పరీక్షలతో తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే దీన్ని నివారించొచ్చు. ఓవైపు అవగాహన లేక.. మరోవైపు పరీక్షలకు తగిన ఆర్థిక స్తోమత లేక ఎందరో మహిళలు వ్యాధి ముదిరే వరకు గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే వ్యాధిని గుర్తించే టెక్నాలజీతో ప్రత్యేక జాకెట్లు, కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటితో పారిశుధ్య మహిళా కార్మికులకు రొమ్ము కేన్సర్ ఉచిత స్క్రీనింగ్‌లను జీహెచ్‌ఎంసీ చేపట్టింది.
దేశంలోని అతి తక్కువ క్లినిక్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ జాకెట్‌ను... పబ్లిక్‌హెల్త్‌లో భాగంగా ఎక్కువ మందికి వినియోగించడం దేశంలో ఇదే ప్రథమం. ఈ సాంకేతికతతో దాదాపు 8 ఏళ్ల ముందే కేన్సర్ సోకే ప్రమాదాన్ని గుర్తించవచ్చు. ప్రాథమిక నిర్ధారణతో తదుపరి అవసరమైన చికిత్సలు పొందే అవకాశం ఉంది. కేన్సర్ నిర్ధారణకు రూపొందించిన ఈ ప్రత్యేక జాకెట్‌ను ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత ఆధారంగా వ్యాధిని ముందుగానే గుర్తించొచ్చు.
ఈ జాకెట్ ధరించేందుకు ఇష్టపడని వారికి శరీరాన్ని తాకకుండానే దాదాపు ఒక అడుగు దూరం నుంచే స్క్రీనింగ్ చేసే కెమెరాను వినియోగిస్తారు. థెర్మలిటిక్స్ టెక్నాలజీతో యాక్టివ్ కేన్సర్ కణాల్ని ప్రాథమిక దశలో గుర్తిస్తారు. కేన్సర్ కణాలున్న భాగంలోని శరీర ఉష్ణోగ్రతను బట్టి థర్మల్ ఇమేజెస్ ఏర్పడతాయని పరీక్షలు నిర్వహిస్తున్న మురాటా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉపకరణాలతో ఎలాంటి నొప్పి ఉండదు. రేడియేషన్ ప్రభావం ఉండదు. కోత, గాట్లు వంటివి ఉండవు. నలభై ఏళ్లలోపు వారిలోనూ కేన్సర్ వచ్చే అవకాశాన్ని గుర్తించవచ్చు. శరీరాన్ని తాకకుండానే స్క్రీనింగ్, పూర్తి గోప్యత, కణతి ఏర్పడకముందే కేన్సర్ లక్షణాల్ని గుర్తించవచ్చు.
సీమెట్ రూపకల్పన...
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో దాని అనుబంధ సంస్థ సీమెట్ ఈ సాంకేతికతను రూపొందించింది. త్రివేండ్రంలోని సీడాక్, కాన్పూర్ మలబార్ కేన్సర్ సెంటర్, నిరామయి స్టార్టప్‌లతో కలిసి ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ వినియోగానికి పేటెంట్ పొందిన జపాన్ మురాటా కంపెనీకి అనుబంధ సంస్థగా నగరంలో ఉన్న మురాటా బిజినెస్ ఇంజినీరింగ్(ఇండియా) లిమిటెడ్ ఉపకరణాల ఉత్పత్తితో పాటు స్క్రీనింగ్ పరీక్షలూ నిర్వహిస్తోంది. పబ్లిక్‌హెల్త్‌లో భాగంగా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తోంది.
ఇదీ పరిస్థితి
- థర్మల్ ఇమేజెస్ ద్వారా కేన్సర్ కణాల పెరుగుదలను రెండో సంవత్సరం నుంచే గుర్తించవచ్చు. మామోగ్రామ్ ద్వారా నాలుగేళ్ల వరకు కూడా కనుక్కోవడం కష్టం.
- గతంలో 40 ఏళ్లు దాటిన వారిలోనే రొమ్ము కేన్సర్లు ఉండేవి. ప్రస్తుతం యుక్త వయసులోనూ పెరుగుతున్నాయి.
- రొమ్ము కేన్సర్ లక్షణాలు చాలా వరకు స్టేజ్ 2, ఆ తర్వాతి దశల్లోనే కనిపిస్తాయి. తరచూ పరీక్షల ద్వారా ముందస్తుగా గుర్తించవచ్చు.
బస్తీ దవాఖానాల్లోనూ..
జీహెచ్‌ఎంసీలోని పారిశుధ్య మహిళా కార్మికులందరికీ ఈ పరీక్షలు చేయిస్తాం. పేద మహిళల సదుపాయార్థం నగరంలోని బస్తీ దవాఖానాల్లోనూ అందుబాటులోకి తెస్తాం.
– బొంతు రామ్మోహన్, మేయర్
అదే మా లక్ష్యం
హైటెక్నాలజీతో కూడిన మెడికల్ ఉపకరణాలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనేదే మా లక్ష్యం. స్వదేశంలో స్థానికులతోనే ఉత్పత్తులు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందుకుగాను సాంకేతికంగా కొంత సహకారాన్ని జపాన్ నుంచి
పొందుతున్నాం.
– కరుణ్‌మల్హోత్రా, ఎండీ (మురాటా బిజినెస్ ఇంజినీరింగ్ ఇండియా)
పేదల కోసం..
చాలామందికి రొమ్ము కేన్సర్‌పై అవగాహన ఉండదు. పారిశుధ్య కార్మికులతో సహా పేద మహిళలెందరికో ఉపయోగపడుతుందనే ఆలోచనతో మురాటా నిర్వాహకులతో సీఎస్సార్ కింద ఉచిత స్క్రీనింగ్‌కు ఒప్పించాం. పరీక్షల శిబిరాలతో క్రమేపీ అవగాహన వస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేన్సర్ స్క్రీనింగ్‌కు రూ.10,000 నుంచి రూ.15,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ఒక్కో జోన్‌లోని ఒక్కో డివిజన్ వంతున దాదాపు 400 మందికి ఉచిత స్క్రీనింగ్‌కు నిర్వాహకులు ముందుకొచ్చారు. ఒకవేళ ఎవరికైనా తదుపరి పరీక్షలు అవసరమైతే ఈఎస్‌ఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
– హరిచందన, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్
కేన్సర్ కణాల పెరుగుదల ఇలా...
చురుగ్గా ఉండే కేన్సర్ కణాలు ప్రతి 90 రోజులకోమారు రెట్టింపవుతాయి.
సమయం | కణాలు |
90 రోజులు | 2 |
సంవత్సరం | 16 |
రెండేళ్లు | 256 |
మూడేళ్లు | 4,896 |
నాలుగేళ్లు | 65,536 |
ఐదేళ్లు | 10,48,576 |
ఆరేళ్లు | 1,67,77,216 |
ఏడేళ్లు | 26,84,35,456 |
ఎనిమిదేళ్లు | 429,49,67,296 |
Comments
Please login to add a commentAdd a comment