హన్మకొండ : భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు జారిపోకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. అధికార పక్షం వేసే ఎత్తుగడలకు అందకుండా పార్టీ అభ్యర్థులపై ఆచితూచీ వ్యవహరించింది. తమ పార్టీ అభ్యర్థులకు టీఆర్‌ఎస్ గాలం వేసిందనే సమాచారంతో బీజేపీ నాయకులు నామినేషన్ల ఉపసంహరణ రోజు శుక్రవారం కావాలనే బీజేపీ అభ్యర్థుల సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హన్మకొండకు చేరుకుని తమ సమక్షంలో అభ్యర్థులను రోజంతా ఉంచుకున్నారు. పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి, బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత చింతల రాంచంద్రారెడ్డి, అర్బన్ జిల్లా ఇన్‌చార్జి రాష్ర్ట కార్యదర్శి డాక్టర్ కాసర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ వరంగల్‌లో మకాం వేసి టీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీ అభ్యర్థులు చిక్కకుండా చూశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. అధికార టీఆర్‌ఎస్ పక్షానికి చిక్కకుండా ఉండేందుకు బీజేపీ రోజంతా సమావేశం జరిపింది. ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలో, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో నాయకులు వివరించారు.
ఉదయం 8 గంటలకు మొదలైన సమావేశంలో సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగించారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం దాటిపోయే వరకు సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన సమయంలో అభ్యర్థులు బయటకు వెళ్లకుండా సమావేశం నిర్వహించిన వేధ బాంక్వెట్ హాల్ తలుపులు మూసి తాళం వేసి నిర్భందించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఫంక్షన్ హాల్‌లోనే ఏర్పాటు చేసి అభ్యర్థులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు.
పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, రావు పద్మతో పాటు మరికొందరు ముఖ్యనాయకులు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి అభ్యర్థుల వైపు నుంచి బీఫాంలు అందజేశారు. ప్రచార సమయంలోను అభ్యర్థులు అధికార పక్షానికి లొంగి ప్రచారం నుంచి తప్పుకోకుండా ఉండేలా పార్టీ అన్ని చర్యలు చేపట్టింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు వెళ్లడం, ఆ పార్టీల ప్రధాన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ రెండు పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు లే కుండా పోయారు. దీంతో భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అనే ధీమాలో బీజేపీ నాయకత్వం ఉంది. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణ చేయించారు.
అభ్యర్థులు జారిపోకుండా జాగ్రత్త !
Published Sat, Feb 27 2016 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM
Advertisement