సాక్షి, తొర్రూరు రూరల్ (పాలకుర్తి): ప్రత్యర్థి పార్టీ శిబిరాలపై అభ్యర్థులు నిఘా పెడుతున్నారు. అక్కడేం జరుగుతుందో వారి వ్యూహమేమిటో.. ఎవరెవరిని కలవబోతున్నారో..ఎప్పటికప్పుడు సమాచారం సేకరించే పనిలో అభ్యర్థులు ఉంటున్నారు. దీనికోసం తమ మనుషులను ఇతర పార్టీల్లోకి చేర్చేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. కొరియర్‌లతో ప్రత్యర్థి ఆలోచనలు, వ్యూహాలను వారికంటే ముందే అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు అన్నిపార్టీల్లో ఉన్న కోవర్టులకు హైరానా మొదలైంది. కొత్తగా చేరుతున్న వారిపై నిఘా పెడుతున్నారు. పెరిగిన కోవర్టులతో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది.
అసలేం జరుగుతుంది..?
ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త పాలిట్రిక్స్ తెరపైకి వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రత్యర్థిపై పైచేయి సాధిం చేందుకు ఒకరికంటే మరొకరు వ్యూహ ప్రతి వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకెళ్లేవారు. కానీ ఈసారి కొత్త రాజకీయం తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. తన పార్టీలోని మనుషులను ప్రత్యర్థి పార్టీలో చేర్చి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే కొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుడుతున్నారు.
ప్రత్యర్థి గెలుపుకోసం పన్నుతున్న వ్యూహాలేమిటి? అతని బలమేమిటి? బలహీనతలేమిటి? ఎవరెవరిని కలవబోతున్నారు? కొత్తగా పార్టీలోకి ఎవరెవరు చేరబోతున్నారు? తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొరియర్లను నియమించుకుంటున్నారు. దీంతో పాటు ప్రత్యర్థి కదలికలను తెలుసుకోవడమే కాకుండా అతనికంటే ముందే సదరు అభ్యర్థి వెళ్లి ప్రత్యర్థి వ్యూహాన్ని అమలు చేస్తుండటంతో ప్రత్యర్థి అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు కొరియర్లపైనే ఎక్కువదృష్టి సారిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీ నుంచి తీసుకొస్తున్న సమాచారంపైనే ఆధారపడుతున్నారు. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లోని కీలక నాయకులు ప్రధాన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా కొరియర్ల ద్వారా అందిన సమాచారంతో ప్రత్యర్థి పార్టీ నాయకులు రాత్రికి రాత్రే సదరు నాయకుల ఇంటికి వెళ్లి సర్ది చెప్పుకుని పార్టీలో కొనసాగేలా చూసుకుంటున్నారట. ఇలా పార్టీ మారే వారితో పాటు పరామర్శలు, ఓదార్పులకు సైతం కొరియర్లు పనికొస్తున్నారు. ఇలా ఎదుట పార్టీలో ఎత్తుగడలు, వ్యూహాలను తెలుసుకునేందుకు ప్రత్యర్థి శిబిరంలో తన మనుషులను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం జరగుతుంది.
సమాచారం నిమిషాల్లో లీక్...
ఎదుటి పార్టీలో చేరిన కొరియర్లతో ప్రత్యర్థులు చిత్తవుతున్నారు. ముఖ్యంగా ఒక పార్టీ అభ్యర్థి గ్రామస్థాయిలో ఉన్న కీలక నాయకులను, యువజన సంఘాలు, మహిళలను ఎలా తనవైపు తిప్పుకుంటాడో.. వారికి ఎలాంటి తాయిలాలు ఇస్తున్నారో సదరు పార్టీలో గ్రామస్థాయి, మండల స్థాయిలో కీలక నేతలెవరు? వారికి మధ్య సత్సబంధాలు ఉన్నాయా? లేవా? ఇలాంటి అంశాలను సేకరిస్తున్నారు. వారి వ్యూహాలను పసిగట్టడంతో పాటు అభ్యర్థితో గ్రామ స్థాయి, మండల స్థాయి కీలక నాయకుల మధ్య మనస్పర్థలు ఉంటే సదరు అభ్యర్థులు అక్కడ వాలిపోతున్నారు. భారీగా తాయిలాలు ఇచ్చి తమవైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment