సాక్షి, చింతపల్లి : పల్లెల్లో ఒకప్పుడు పలుకుబడి ఉన్న చోటామోటా నేతలంతా ఇప్పుడు పట్టణం వీడి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. పండుగకో ..పబ్బానికో వచ్చే నేతలంతా ఎన్నికల సమయానికి రెక్కలు కట్టుకొని సొంత ఊళ్లలో వాలిపోతున్నారు. వారంతా ఎంతోకొంత రాజకీయ నేపథ్యం ఉన్న వారు కావడంతో తమ మాట నెగ్గించుకునేందుకు తహతహలాడుతున్నారు. పార్టి పెద్దలను ప్రసన్నం చేసుకుంటూనే తమ పరపతిని ప్రదర్శిస్తున్నారు. తాము మద్దతిచ్చే పార్టి అభ్యర్థి గెలి స్తేనూ.. లేక పార్టి అధికారంలోకి వస్తేనూ తాము కూర్చున్న వద్దనే చక్రం తిప్పుకునే అవకాశాలు ఉంటాయని ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న ప్రముఖులు చాలా మంది రాష్ట్ర రాజధానికి వెళ్లి స్థిరపడ్డారు. మండలంలోని ముఖ్యులు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరంతా ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఊళ్లోనే తిష్ట వేస్తున్నారు.
రాజకీయ అనుభవాన్ని రంగరిస్తున్నారు.. పాతికేళ్లకుముందు ప్రజల్లో రాజకీయ చైతన్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా అప్పటికి లేకపోవడంతో కాస్త పేరు, పలుకుబడితో ఆర్థికంగా అంగబలం ఉన్న వారంతా స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలుగా చెలామణి అయ్యారు. ఏళ్లతరబడి స్థానికంగా రాజకీయాలను శాసించే వారు. వారు చేసే అభివృద్ధి జన ఆదరణకు కారణమయ్యేవి. పంచాయతీకి వచ్చే నిధులతో గుత్తేదారులుగా ఉండి పనులు చేయించే వారు. ఊరికి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు వస్తే వారినిది సంప్రదించనిదే మాట ఇచ్చే వారు కాదు. అంతటి ప్రాబాల్యం ఉన్న గ్రామ స్థాయి నేతలంతా ఇప్పుడు మరోమారు చక్రం తిప్పే పనిలో పడ్డారు.
తాజాలు.. మాజీలు కూడా..
పల్లెల్లో.. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులుగా ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులుగా పని చేస్తున్న వారిలో కూడా కొంత మంది మండల జిల్లా కేంద్రం కేరాఫ్‌గా ఉండే వారు. తాజా మాజి సర్పంచులతో పాటు ప్రస్తుతం ఉన్న ఎంపిటిసిలలో కొంత మంది ఇదే వరుసలో ఉన్నారు. చాలా మంది మండల కేంద్రంలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పిల్లలు చదువుకోలేక, వ్యాపార పనులకో పల్లెలను వదిలేశారు. ఇలాంటి వారు మళ్లీ ఎన్నికల కోసం ఆగమేఘాల పై సొంత ఊరికి వచ్చి తిరుగుతున్నారు. అవ్వా.. మంచిగున్నావా అంటూ పలకరింపులు మొదలుపెట్టారు. తమ ఊరికి చేసిన ఉపకారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎవరికైన కష్టం వస్తే ఆపదలో తాము ఆదుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామఅభివృద్ధికి భారీగా నిధులు కావాలన్నా, గ్రామంలో సమస్యలు పరిష్కారం కావాలంటే పైస్థాయి పరిచయాలు ఉన్న తమలాంటి నేతల మాటలకు విలువ ఇస్తే పూర్తయితాయని భరోసా కల్పిస్తున్నారు.
అభ్యర్థులు కూడా వారి వెంటనే..
ఏ గ్రామంలో కూడా మూకుమ్మడిగా ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తులపైనే అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎవరి మాట ఎవరు వింటారనేదానిపైనే దృష్టిపెట్టారు. ఇప్పటితరం దానికి భిన్నమైనప్పటికి పాత తరం వారి మాట వేదమంటారు. చైతన్యం ఉన్న వారి అడుగుజాడల్లో నడవాలని కలుస్తారు. అందుకే అభ్యర్థులు కూడా పాత కాలపు ప్రాధాన్యతనిస్తున్నారు. క్యాడర్ సమన్యాయాన్ని, ఎన్నికల బాధ్యతలను అప్పజెబుతున్నారు. చివరి వరకు అన్ని తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. భవిష్యత్తులో అదే తమకు శ్రీరామరక్ష అవుతుందని తలుస్తున్నారు. పోలింగ్ పూర్తయితేనే కాలు బయట పెట్టి తట్టాబుట్ట సర్దుతారు. అప్పటి వరకు ఊళ్లోనే ఉంటామంటున్నారు నేతలు.
Comments
Please login to add a commentAdd a comment