సాక్షి సిటీబ్యూరో: ముస్లింలకు రంజాన్ నెల పవిత్రమైంది. వారు ఈ నెల రోజులూ ఉపవాసం ఉంటూ ప్రత్యేక ప్రార్థలను చేస్తారు. నిష్టతో ఐదుపూటలా నమాజ్ చేస్తారు. నమాజ్ సమయంలోనే కాకుండా రోజంతా ప్రతి ఒక్కరూ టోపీలు ధరిస్తారు. పైగా ప్రతి ముస్లిం మహ్మద్ ప్రవక్త సంప్రదాయంగా టోపీని ధరించడం ఆనవాయితీ. ఈ టోపీ ధరిస్తే చెడు కార్యాలకు దూరంగా ఉంటారని ఓ నమ్మకం. ఇక ఈ నెలలో శుక్రవారానికి.. అందులోనూ మొదటి శుక్రవానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆరోజు ముసల్మానులు ఎవరికి వారు ప్రత్యేకంగా కనబడేందుకు ఆసక్తి చపుతుంటారు. అందుకోసం ఎవరికి వారు లేటెస్ట్ డిజైన్ల టోపీలనే ఎంచుకుంటారు. ఈ సందర్భంగా గురువారం చార్మినార్, మదీనా సర్కిళ్లల్లోని క్యాప్ మార్ట్‌లు, మొహదీపట్నం,టోలిచౌకీ ప్రాంతాల్లోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
వివిధ దేశాల డిజైన్లు దిగుమతి
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని క్యాప్ మార్ట్‌లు ముస్లింలు ధరించే టోపీలను విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకున్నారు. ముఖ్యంగా ఇస్లామిక్ సంప్రదాయం పాటించే ఇండోనేషియా, బంగ్లాదేశ్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఒమాన్, సౌదీ, మలేసియాతో పాటు చైనా నుంచి కూడా టోపీలు నగరానికి దిగుమతయ్యాయి. వీటిలో ఖురేషియా, ఒమానీ, సౌదీ రేషం, ఆజ్మేరీ, తహెరుల్ ఖాద్రీయా, షేర్‌గోలా, పాకిస్తానీ కమాన్, ఆఫ్ఘనీ గోల్, చైనా జాలీ, ఇండోనేసియా కమాల్ వంటి వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇక వేడుకల్లో వాడే జిన్నా క్యాప్, సాలార్‌జంగ్ క్యాప్, రోమీ టోపీలు అదనం. రోజు వారి వాడే టోపీల ధరలు రూ.50 నుంచి రూ.150 వరకు ధర ఉంది. రంజాన్ నెలలో వాడే టోపీల ధరలు రూ 200 నుంచి రూ.500 మధ్య ఉన్నాయి. ఇక వేడుక టోపీల ధరలు రూ.1000 నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment