నా జీతం నుంచి కట్ చేసి సహకార పర పతి సంఘం (సీసీఎస్)లో డిపాజిట్ చేసిన డబ్బు రూ.రెండున్నర లక్షలు ఉంది. అందులోంచి రూ. 2.5 లక్షల రుణం కోరితే లేదంటే ఎలా?. అత్యవసరమై పిల్లల చదువు కోసం బయట అప్పు చేశా. ప్రతినెలా రూ.10 వేలు వడ్డీ కట్టాల్సి వస్తోంది. వేతనంలో అంత మొత్తం అటు పోతే మేము బతికేదెట్లా
– నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ గోడు
కుటుంబ అవసరాల కోసం ఓ కండక్టర్ వడ్డీ వ్యాపారి వద్ద రూ.9 లక్షలు అప్పు చేశాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు ఆయన కుటుంబం అప్పు తీర్చేదెలా అని లబోదిబోమంటోంది. అదే ఆర్టీసీ సహకార పరపతి సంఘం నుంచి లోన్ వచ్చి ఉంటే, నిబంధనల ప్రకారం ఆ అప్పు మాఫీ అయి ఉండేది.
– హైదరాబాద్‌కు చెందిన కండక్టర్ కుటుంబం ఆవేదన
ఇలా ఎంతో మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు ప్రతినెలా తమ జీతంలో నుంచి దాచి పెట్టుకున్న నిధిని ఆర్టీసీ యాజమాన్యం స్వాహా చేసేయటమే దీనికి కారణం. ఏడాది కాలంగా ఆ మొత్తాన్ని సొంత అవసరాలకంటూ ఆర్టీసీ వాడేసుకుని, ఇప్పుడు చెల్లించలేమంటూ చేతులెత్తేయడంతో అత్యవసరాలకు రుణాలు అందక కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇదీ ఆర్టీసీ సహకార పరపతి సంఘం దీనావస్థ. కాగా, యాజమాన్య తీరును నిరసిస్తూ ఆ సంఘం నిర్వాహకులు చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు.
ఏమిటీ ఈ నిధి...
ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యేకంగా సహకార పరపతి సంఘం ఏర్పాటైంది. ప్రతి ఉద్యోగి జీతంలో బేసిక్‌పై 7 శాతం మొత్తాన్ని సంస్థ కట్ చేసి ఈ సంఘానికి జమ చేస్తుంది. అలా ప్రతినెలా తెలంగాణ ఆర్టీసీలో రూ.40 కోట్లు జమ కావాలి. అలా వచ్చే మొత్తం నుంచి కార్మికులు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవటం... తదితర అవసరాలకు రుణంగా పొందుతారు. ఆ మొత్తాన్ని బ్యాంకు వడ్డీ కంటే తక్కువ వడ్డీతో చెల్లిస్తారు.
జరిగింది ఇదీ..
దాదాపు 12 నెలలుగా ఆర్టీసీ ఆ నిధులను సీసీఎస్‌లో జమ చేయటం లేదు. దీంతో ఏడు నెలలుగా సీసీఎస్ అధికారులు రుణాలు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులూ రావటం లేదని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఉపయోగం లేదని అధికారులు పేర్కొనటంతో గత్యంతరం లేక సీసీఎస్ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో సీసీఎస్ నిధిని వాడుకుంటే ఆర్టీసీ వడ్డీతో సహా తిరిగి చెల్లించేది. కానీ టీఎస్‌ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి వడ్డీ ఇవ్వక రూ.45 కోట్ల బకాయిలు పడింది. దీంతో సీసీఎస్ అంటేనే కార్మికులకు నమ్మకం సడలింది. కొంతకాలంగా దాదాపు 4 వేల మంది కార్మికులు సభ్యత్వాన్ని రద్దు చేసుకుని బయటకొచ్చారు.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment