
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హజీపూర్ ఘటనతో సీసీ కెమెరాల ఆవశ్యకత మరోసారి తెరపైకి వచ్చింది. బొమ్మలరామారం నుంచి హజీపూర్‌కు వెళ్లాల్సిన విద్యార్థిని శ్రావణిని అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, దారుణం హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బొమ్మలరామారం బస్‌స్టాప్ వద్ద సీసీటీవీ కెమెరాలున్నా పనిచేయకపోవడంతోనే శ్రీనివాసరెడ్డి ఘాతుకాన్ని గుర్తించడంలో ఆలస్యం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని యాదాద్రి, భువనగిరి డివిజన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినా స్థానిక అధికారులు వాటిని నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి అటకెక్కాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ప్రతి మండలం, గ్రామ పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడమేగాక వాటిని ఆయా పోలీసు స్టేషన్లకు అనుసంధానించేందుకు సన్నాహాలు చేపట్టారు.
‘మహా’ కమిషనరేట్‌లో నిరంతర నిఘా...
5091.48 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్‌గా గుర్తింపు పొందిన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి, యాదాద్రి లా అండ్ అర్డర్ జోన్లు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మిళితమైన ఈ కమిషనరేట్‌లో నేరాలను నియంత్రించేందుకు సీసీటీవీల అవసరాన్ని గుర్తించిన సీపీ అందుకు అనుగుణంగా ఆయా జోన్లలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, నేను సైతం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించే బాధ్యతను ఆయా జోన్ల డీసీపీలకు అప్పగించారు. తద్వారా చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పాటు సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులను పట్టుకోవడమేగాక, వారికి శిక్ష విధించడంలోనూ పోలీసులు సఫలీకృతులయ్యారు.
యాదాద్రిపై ప్రత్యేక దృష్టి...
యాదాద్రి ఆలయంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు జరుగుతుండటంతో సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే భువనగిరి, యాదాద్రి, చౌటుప్పల్ డివిజన్‌లలో 941, 812, 1942 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. మొత్తంగా యాదాద్రి జోన్‌లో 4773 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే హజీపూర్ ఘటనతో వీటిలో చాలావరకు సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెలుగులోకి రావడంతో సీపీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయా పోలీసుస్టేషన్‌ల అధికారులు సీసీటీవీ కెమెరాల మరమ్మతులు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో వాటిని ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో కలిగే లాభాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. అలాగే మల్కాజ్‌గిరి జోన్‌లో 38,208 ఎల్‌బీనగర్ జోన్‌లో 34,779 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే హజీపూర్ ఘటనతో ఒక్కసారిగా మేల్కొన్న పోలీసు అధికారులు ఇప్పటికే బిగించిన సీసీటీవీ కెమెరాల పనితీరుతో పాటు కొత్త సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించారు. మూడు జోన్‌లలో కలిపి 77,760 సీసీటీవీ కెమెరాలుండగా వీటి సంఖ్యను రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ
ఒక్క సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఈ నిఘానేత్రాలు ఏర్పాటు చేయడం వల్ల సంచలనాత్మక కేసులు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, హత్యలు తదితర నేరాల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి. అయితే హజీపూర్ ఘటనతో యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఉన్న సీసీటీవీ కెమెరాల పనితీరుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం.–మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment