ఖమ్మం జెడ్పీసెంటర్ : 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన వేడుకలు ఆద్యంతం ఆహ్లాదంగా సాగాయి. వివిద పాఠశాలల విద్యార్థుల కళారూపాలు , ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు విడుదల చేసిన ఐదు ద్విచక్ర వాహనాలు, 2 ఇన్నోవా వాహనా లు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మార్పు కార్యక్రమంపై రూపొందిం చిన శకటం ఆకట్టుకుంది.
ఐకేపీ-డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రూపొందిం చిన శకటం ద్వారా మహిళల స్వయంకృషికి చేపడుతున్న పధకాలను వివరించారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ గురించి ఎస్సీ కార్పొరేషన్ శకటంతో తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలలో అందిస్తున్న వైద్య సేవల గురించి 104, 108 శకటాల ద్వారా వివరించారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం ఖిల్లా చరిత్ర, బయ్యారం శిలాశాసనం, భద్రాచలం రామాలయం విశిష్టతను తెలిపేలా రూపొందించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మొక్క ల పెంపకం, పండ్లతోటలతో లాభాలు, ఆరుతడి పంటలసాగుతో అధిక దిగుబడి సాధించే విధానం, వరి, మొక్కజొన్న పంటలకు నీరందించే తీరు గురించి ఉపాధిహమీ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు వివరించాయి. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐసీడిఎస్ వారు రూపొందించిన శకటాల ద్వారా తెలియజేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పద్మారావుగౌడ్ హాజరు కాగా, కలెక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ ఎ.వి.రంగనాథ్, జేసీ సురేంద్రమోహన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు బాణోత్ మదన్‌లాల్, పాయం వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రూ.60 కోట్ల విలువైన ఆస్తుల పంపిణీ
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ రూ.60 కోట్ల విలువైన ఆస్తులను జిల్లా ప్రజలకు పంపిణీ చేశారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు చెక్కులు, పనిముట్లు అందజేశారు. వ్యవసాయ శాఖ అధ్వర్యంలో 11 మంది లబ్ధిదారులకు రూ.53.35 లక్షల విలువ గల పనిముట్లు అందించారు. పరిశ్రామల శాఖ ద్వారా రూ.26.70 లక్షల విలువైన 5 వాహనాలను అందజేశారు.
మెప్మా ఆధ్వర్యంలో 260 స్వయం సహాయక సంఘాలకు రూ.5 కోట్ల బ్యాంక్ లింకేజీ, ఐకేపీ-డీఆర్‌డిఏ కింద 1642 మంది స్వయం సహాయక సంఘాలకు రూ.47.04 కోట్ల బ్యాంక్ లింకేజీని అందించారు. 5 వేల మంది విద్యార్థులకు రూ.6 కోట్ల ఉపకార వేతనాలు, వికలాంగ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమం కింద రూ.8 లక్షలు, వికలాంగులకు రూ.6 లక్షల విలువైన ట్రైసైకిళ్లు అందించారు.
భూమి కోనుగోలు పథకం కింద 9 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.1.14 కోట్ల విలువైన 22.14 ఎకరాలు పంపిణీ చేయాలని గుర్తించగా, మంత్రి చేతులు మీదుగా ముదిగొండ మండలం గంధసిరి గ్రామానికి చెందిన గద్దల లక్ష్మి, కూసుమంచి మండలం నేలపట్లకు చెందిన కళ్యాణి, పుష్ప, వైరా మండలం గొల్లెనపాడుకు చెందిన మీరాలకు పట్టాలు అందించారు.
కమనీయంగా వేడుకలు
Published Sat, Aug 16 2014 3:00 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement