సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వివిధ పథకాలకు సంబంధించి ఇవ్వాల్సిన నిధులు రావడం లేదని, దీనిపై వెంటనే కేంద్రానికి లేఖలు రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పలు శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. రెండో దశలో కేంద్రం తెలంగాణ కు విడుదల చేసే నిధులు పాత బకాయిలతో సహా ఇచ్చేలా చూడాలని ఆ లేఖల్లో కోరాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రావాల్సిన నిధుల అంశంపై మంగళవారం సీఎస్ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని నిధులు విడుదలయ్యాయని, అయితే విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ వాటా నిధులు వెళుతున్నాయని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ. 15 వేల కోట్ల వరకూ నిధులు వస్తాయని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఉందని.. వాస్తవంగా రూ. పదివేల కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. అందులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కేవలం రూ. 1,126 కోట్లు మాత్రమేనని చెప్పారు.
జూన్‌లో సర్వశిక్షా అభియాన్ కింద రూ. 1,454 కోట్ల కేంద్ర నిధులు విడుదల కాగా.. అందులో తెలంగాణకు రూ. 142 కోట్లు మాత్రమే వచ్చాయని, వాస్తవానికి ఈ పథకం కింద రూ. 600 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని తెలిపారు. అలాగే వ్యవసాయ పథకాల కింద రూ. 986 కోట్లు రావాల్సి ఉండగా.. తెలంగాణకు ఇప్పటివరకు కేవలం రూ. 92 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఏఐబీపీ, ఈజీఎస్, సర్వశిక్షా అభియాన్, వ్యవసాయం, పట్టణ నవీకరణ పథకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం, జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం వంటివాటి కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర నిధులు వస్తున్నాయని.. అందులో నిష్పత్తి ప్రతిపాదికన టీ సర్కారుకు రావాల్సిన నిధులు అందడం లేదని వివరించారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం రూ. 2,250 కోట్లు విడుదల చేసిందని.. అయితే తెలంగాణలో మాత్రం ఆ పథకం కింద నిధులను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు సీఎస్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎస్... ఈ మేరకు నిధులు ఇవ్వాలంటూ కేంద్ర శాఖల కార్యదర్శులకు తక్షణమే లేఖలు రాయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జోషి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాల నిధులు రావట్లేదు!
Published Wed, Oct 1 2014 2:12 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement