
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ గడువు ముగింపు సమీపిస్తోంది. నగరంలో నాలుగు రోజుల నుంచి కేసుల సంఖ్య కొంతవరకు తగ్గినట్లు కన్పిస్తున్నా.. ఇప్పటికీ రోజుకు సగటున ఐదారు పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. కరోనా మళ్లీ కట్టు తప్పే ప్రమాదం లేకపోలేదు. కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ అమలు చేసే విషయంలో మరింత కఠినంగా ఉండాలని రెండు రోజులుగా నగరంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం రాష్ట్ర యంత్రాంగానికి సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కరోనా వైరస్‌ను పూర్తిగా నియంత్రించాలంటే ఇబ్బందికరమే అయినా కొన్ని కఠిన నిర్ణయాలు తీసÜుకోక తప్పదని స్పష్టం చేసినట్లు తెలిసింది. మార్చి 22న కేంద్రం జనతా కర్ఫ్యూ ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్ 15 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేసింది.
వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ సహా ఎన్నారై, మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో క్వారంటైన్ సమయం ముగిసిన తర్వాత కేసులు వెలుగు చూడటంతో కేంద్రం ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ గడువు మరో ఆరు రోజుల్లో ముగియనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ గడువు మరో 10 రోజుల్లో ముగియనుంది. ఒకవైపు లాక్‌డౌన్ ముగింపు గడువు సమీపిస్తుండటం.. మరోవైపు కేసుల సంఖ్య పూర్తిగా తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. రెండు రోజుల క్రితం రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కంటైన్మెంట్ క్లస్టర్లలో ఆంక్షలను ఏమాత్రం సడలించినా భవిష్యత్తులో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వైరస్‌ను ఆపడం ఎవరి తరమూ కాదని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే మరో వారం పది రోజులు లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకు పోలీçసులు, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, ఇతర శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కంటైన్మెంట్ గైడ్ లైన్స్‌ను కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.