సౌండ్‌ పెరిగితే చలాన్‌ మోతే! | Challans on Bike Horns Rises in Hyderabad | Sakshi
Sakshi News home page

సౌండ్‌ పెరిగితే చలాన్‌ మోతే!

Published Mon, Jul 22 2019 8:49 AM | Last Updated on Thu, Jul 25 2019 1:19 PM

Challans on Bike Horns Rises in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రహదారిలో నిదానంగా వెళ్తున్న వాహనచోదకుడికి వెనుక నుంచి వస్తున్న ట్రావెల్స్‌ బస్సు హారన్‌ మోగిస్తే అతడి గండె ఆగినంత పనవుతుంది... రోడ్డుపై నడుస్తున్న పెడస్ట్రియన్‌ పక్క నుంచి బుల్లెట్‌ తరహా వాహనం దూసుకుపోతే దాని సౌండ్‌ దడపుడుతుంది... నగరవాసుల్లో అనేక మందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి వాటి ఫలితంగానూ రాజధానిలో శబ్ధ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరి అనేక మంది చెవి రుగ్మతలకు గురవుతున్నారు. దీనిని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి వాహనచోదలకు చెక్‌ చెప్పడానికి ఈ నెల 14 నుంచి స్పెషల్‌ డ్రైవ్స్‌కు శ్రీకారం చుట్టారు. ఫలితంగా వారం రోజుల్లో 654 కేసులు నమోదు చేశారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ఓ వాహనం హారన్‌ గరిష్టంగా 93 నుంచి 100 డెసిబుల్స్‌ మధ్య మాత్రమే శబ్ధం చేయాలి. అలాగే ఆయా వాహనాల ఇంజిన్లు, సైలెన్సర్లు సైతం ఎంత శబ్ధం చేయవచ్చనేది స్పష్టంగా నిర్ధేశించి ఉంది. అయితే ఈ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్న వాహనచోదకులు పరిమితికి మించి శబ్ధాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కేవలం ప్రైవేట్‌ వాహనాలు, ట్రావెల్స్‌ బస్సులు, బుల్లెట్‌ తదితర వాహనాలు మాత్రమే కాదు.. చివరకు ఆర్టీసీ బస్సులు, కాలేజీలు, స్కూళ్ళకు విద్యార్థులను తరలించే వాహనాలు సైతం కర్ణకఠోరమైన శబ్ధాలను విడుదల చేస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఫ్యాన్సీ హారన్లు, ఎయిర్‌ హారన్స్, మల్టీ టోన్‌ హారన్స్, మాడిఫైడ్‌ సైలెన్సరే ఇందుకు కారణమని నిర్ణయించారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులకు కేటాయించిన సౌండ్‌ లెవల్‌ మీటర్ల సాయంతో నిర్ణీత వేళల్లో డ్రైవ్స్‌ చేస్తున్నారు. ఆయా హారన్లు వెంటనే తొలగించాల్సింగా వాహనాల డ్రైవర్లు, ఆయా సంస్థల నిర్వాహకులకు సైతం స్పష్టం చేశారు.  

14–20 తేదీల మధ్య కేసులు ఇలా
ఉల్లంఘన                      కేసులు
ఎయిర్‌ హారన్‌                   125
మల్టీ టోన్డ్‌ హారన్‌               424
ఇంజిన్‌/సైలెన్సర్‌ శబ్ధాలు     105
మొత్తం                            654

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement