
'తెలంగాణను నాశనం చేయాలని బాబు చూస్తున్నారు'
విద్యుత్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణను నాశనం చేయాలని బాబు చూస్తున్నారని మండిపడ్డారు. కరెంటు ఇవ్వకుండా ఇక్కడి పంటలు ఎండిపోయేలా ఆయన చేస్తున్నారని, చంద్రబాబు కుట్రలను తాము తిప్పికొడతామని ఈటెల అన్నారు. ఈ అంశాన్ని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ఇక నవంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని, తెలంగాణ చరిత్రలోనే నిలిచిపోయేలా బడ్జెట్ ఉంటుందని ఆయన అన్నారు.
మరోవైపు నల్లగొండ జిల్లాలోకూడా చంద్రబాబు వైఖరిపై తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. చంద్రబాబు తెలంగాణను వెనక్కి నెట్టేయాలని చూస్తున్నారని, ఇక్కడ రైతు ఆత్మహత్యలకు ఆయనే కారణమని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. టీ-టీడీపీ నేతలు చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కృష్ణా ట్రిబ్యునల్కు చంద్రబాబు లేఖ రాయడం పైశాచికత్వమని ఆయన అన్నారు.