
చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎంపీ కవిత ఫైర్
నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని, ఆయన తన బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారని ఆమె మండిపడ్డారు. ఆది నుంచి తెలంగాణకు చంద్రబాబు ద్రోహం చేస్తూనే ఉన్నారని కవిత శుక్రవారమిక్కడ అన్నారు. తెలంగాణలో టీడీపీ ఉండటానికి అర్హత లేదనే విధంగా చంద్రబాబే నిరూపించుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఇక తెలంగాణలో టీడీపీ దుకాణాన్ని మూసుకుంటే బాగుంటుందని కవిత వ్యాఖ్యానించారు.
చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు: ఈటల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అందుకే అసహనంతో విమర్శలు చేస్తున్నారని ఈటల శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ను అవమానించేలా చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఇవ్వాలని కోరినవారిలో చంద్రబాబు కూడా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ ఒక్కరే పార్లమెంట్‌లో అంతమంది ఎంపీలను బలవంతంగా కూర్చోబెట్టి రాష్ట్ర విభజన బిల్లును పాస్ చేయించగలరా అని ఈటల ప్రశ్నించారు.