
శాడిస్టు చంద్రబాబు వల్లే కరెంటు కోతలు
సాక్షి, హైదరాబాద్: శాడిస్టుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నిర్వాకం వల్లే తెలంగాణ రాష్ట్రం లో కరెంటుకు ఇబ్బందులు వస్తున్నాయని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. శనివారం ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాల రాజుతో కలసి ఆయున హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కరెంటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఆంధ్రాలో 24 గంటలు ఇస్తామని చంద్రబాబు శాడిస్టులా వ్యవహరిస్తున్నారని వుండిపడ్డారు. తెలంగాణ ప్రజలపై బాబుకు ప్రేమ ఉంటే కరెంటు ఇచ్చి తెలంగాణను ఆదుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణకు 54 శాతం కరెంటును ఇవ్వాల్సి వస్తుం దనే కృష్ణపట్నం ప్రాజెక్టులో ఉత్పత్తిని ప్రారంభించలేదని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కైనా బాబు కరెంటును ఇవ్వవచ్చు కదా అని ఈటెల ప్రశ్నించారు.
దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కొనలేనంత కరెంటును టీ సర్కార్ కొని, రైతాంగానికి అందిస్తుందన్నారు. అయినా బాబు, ఆ పార్టీ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడటం సరికాదని ఈటెల హెచ్చరించారు. కరెంటు ప్లాంటు పెట్టడానికి సమయం పడుతుందనే విషయం బాబుకు తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణలోని శంకరపల్లి, నేదునూరు విద్యుత్‌ప్లాంట్లు ఉత్పత్తిని ప్రారంభించకుండా ద్రోహం చేసిన కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు ప్లాంట్లు ప్రారంభమైతే కరెంటు కోత ఉండేది కాదన్నారు. ఒకవైపు రైతులకోసం కరెంటును కొంటూనే మరోవైపు కొత్త ప్లాంట్లకోసం ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. 2017 నాటికి మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి అవుతుందని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. కరెంటు కోతలకు, రైతుల ఆత్మహత్యలకు టీడీపీ, కాంగ్రెస్‌లే కారణమన్నారు.
తిరగబడింది ఆ బక్కపలుచని వ్యక్తే: కర్నె
‘ఆ బక్క పలుచని వ్యక్తే టీడీపీ వంటి ఆంధ్రా దుర్మార్గపాలనపై తిరగబడింది. చంద్రబాబు వంటి మూర్ఖపు, శాడిస్టు నేతను విజయవాడకు పరిమితం చేసింది..., పచ్చపార్టీని తెలంగాణలో కనుమరుగు చేసింది కూడా ఆ బక్కపలుచని నాయకుడే’ అని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలంగాణలో కరెంటు సమస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపుతున్నారని చెప్పారు.