
రెండోరోజూ బుజ్జగింపులు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేరుతారనే...
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేరుతారనే వార్తలతో అప్రమత్తమైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వరుసగా రెండోరోజూ బుధవారం కూడా బుజ్జగింపుల పర్వానికి దిగారు. మంగళవారం జరిపిన సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్‌లు చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆరా తీసిన ఆయన... ముగ్గురు ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు.
రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, వాటిని తట్టుకునే నిలబడితేనే భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గులాబీ శిబిరం వలలో చిక్కవద్దని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన మీరు.. ఈ సమయంలో అనవసర ఆలోచనలు పెట్టుకోవద్దని హితోపదేశం చేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చే సేందుకు సమావేశాలు నిర్వహించుకోవాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మరోవైపు పార్టీ మారుతారనే ప్రచారంపై ఎమ్మెల్యేలు నర్మగర్భంగా వ్యవహరించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌లో చేరడంలేదని, పత్రికల్లో వస్తున్న కథనాలు నిరాధారమని పేర్కొన్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ ఆడుతున్న మైండ్‌గేమ్‌లో భాగంగానే తమపై దుష్ర్పచారం జరుగుతోందని చంద్రబాబుతో అన్నట్లు సమాచారం.