జంప్ జిలానీలు ఎవరో.. | TRS's operation akarsh success | Sakshi
Sakshi News home page

జంప్ జిలానీలు ఎవరో..

Published Tue, Sep 23 2014 11:21 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

TRS's operation akarsh success

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే ప్రచారం ఆ పార్టీని కలవరపెడుతోంది. సైకిల్ దిగి కారెక్కే వారి జాబితాలో జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగ జారడంతో పలువురు శాసనసభ్యులు అధికారపార్టీ వైపు చూస్తున్నారు. త్వరలో జరిగే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న గులాబీ నాయకత్వం కూడా జిల్లా ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది.

వివిధ మార్గాల్లో వారిపై వల విసిరిన టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు... అన్ని రకాలు ఆశలు చూపుతున్నారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తులేదని, మాతో కలిస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందనే భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అగ్రనాయకులు సంప్రదింపులు కూడా జరిపారు. తెలంగాణలో పార్టీ బలహీనంగా మారడం, టీఆర్‌ఎస్ దూకుడును తట్టుకోలేమని భావిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ దిశగా ఇప్పటికే అనుచరుల అభిప్రాయాలను తెలుసుకుంటున్న కొందరు... కారు ఎక్కేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. కేవలం అభివృద్ధి నిధులు విషయంలోనే సీఎంను కలిశానని, ఆయన స్పష్టం చేసినప్పటికీ, ప్రకాశ్ పార్టీ మారడం ఖాయమని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ఇటీవల కేసీఆర్‌ను కలిశారు. ఈయన కూడా త్వరలోనే గులాబీ గూటికి చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.

 కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, గాంధీ, వివేకానంద్ పేర్లు కూడా జంప్‌జిలానీల జాబితాలో ఉన్నప్పటికీ, వారు మాత్రం టీడీపీని వెన్నంటే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పూర్తిగా టీఆర్‌ఎస్ నాయకుల అధిపత్యమే కొనసాగుతోందని, అధికారులు కూడా వారి కనుసన్నల్లోనే పనిచేస్తుండడంతో తామంతా ఉత్సవ విగ్రహాలుగా మారామని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అంతరంగికుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.

 ఇంకోవైపు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా గులాబీ దళంలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా టీఆర్‌ఎస్ అగ్రనేతల ఒత్తిడి ఉందన్న వార్త అప్పట్లో గుప్పుమంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంచిరెడ్డి కూడా సైకిల్ దిగే అవకాశంలేకపోలేదనే వాదన వినిపిస్తోంది.

 ఆయన మాత్రం పార్టీ మారే అవకాశం లేదని విస్పష్టంగా చెబుతున్నప్పటికీ, టీఆర్‌ఎస్ నేతలు మాత్రం త్వరలోనే రంగారెడ్డి జిల్లాలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమని పేర్కొంటున్నాయి. ఇప్పటికే పలువురు నేతలతో మంతనాలు కూడా కొలిక్కివచ్చాయని, దసరాలోపే వీరి చేరికలు ఉండే అవకాశంలేకపోలేదని చెబుతున్నాయి.

 దిద్దుబాటు చర్యలు
 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరనున్నారనే సంకేతాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు తీగల, వివేకానంద్, కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ వీడాలనే ఆలోచనను విడనాడాలని, తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు మీ కనుసన్నల్లో కొనసాగుతాయని, ఇక్కడ మీరే నాయకులనే విషయాన్ని గుర్తెరిగి పనిచేయాలని బాబు సూచించినట్లు తెలిసింది.

టీఆర్‌ఎస్ ప్రలోభాలకు తలొగ్గితే... మీ రాజకీయ భవిష్యత్తును దెబ్బతింటుందని హితోపదేశం చేసినట్లు సమాచారం. అధినేత బుజ్జగింపులకు తలూపిన ఎమ్మెల్యేలు... పార్టీ వీడుతున్నట్లు వస్తున్నట్లు వార్తల్లో సత్యంలేదని, టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ ఆడుతుందని పేర్కొన్నట్లు తెలిసింది.

 ఇదిలావుండగా, ఈ సమావేశానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి డుమ్మా కొట్టారు. తన ఇంట్లో ‘పెద్దల’కు బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉండడంతోనే తాను సమావేశానికి హాజరుకాలేదని మంచిరెడ్డి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement