
బాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి అన్యాయం
మండలిలో నిప్పులు చెరిగిన విపక్ష నేత రామచంద్రయ్య
సాక్షి. హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థతే కారణమని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య దుయ్యబట్టారు. బుధవారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరగలేదని స్వయానా ముఖ్యమంత్రే వెల్లడించారని గుర్తు చేశారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో కొన్ని శాఖలకు సగానికిపైగా నిధులు తగ్గించారని, ఇలా అయితే రానున్న కాలంలో రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుందని చెబుతూ పలు పథకాలకు సంబంధించి నిధుల గణాంకాలు వివరించారు. విభజన కారణంగా తలెత్తిన అసమానతలు ఏమైనా ఉంటే వాటిని తొలగించేందుకు ఎలాంటి సవరణలు తీసుకొచ్చినా కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు.