ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీతో పాటు ఏపీ కమిటీ ఇన్‌చార్జిగా ఆర్కే
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రానికి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీకి కార్యదర్శిగా పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్నను కేంద్ర కమిటీ నియమించింది. ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఆయన వ్యవహరించాడు. అయితే, ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణపై కూడా పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఉత్తర తెలంగాణలో తిరిగి పట్టును సాధించేందుకు చంద్రన్నకు తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యతలను అప్పగించినట్లు చెప్తున్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ బాధ్యునిగా చంద్రన్నను నియమించటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇక ఇప్పటివరకు ఆంధ్రా - ఒడిశా స్పెషల్ జోన్ కమిటీకి ఇన్‌చార్జిగా ఉన్న రామకృష్ణకు అదనంగా ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కమిటీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ స్థానంలో కొత్త నేతను నియమించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు చెప్తున్నాయి.