
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చార్మినార్‌కు వెళ్లినవారికి అక్కడున్న రకరకాల దుకాణాలు..ఇరుకు గల్లీలు..హడావుడి షాపింగ్ దృశ్యాలు కన్పిస్తాయి. చిన్న చిన్న మార్గాల్లో పెద్ద బోర్డులతో గజిబిజి వాతావరణం ఉంటుంది. ఒక్కో దుకాణం ఒక్కో రూపు. ఒక్కో ఆకారం. ఇకపై ఈ పరిస్థితిలో మార్పు రానుంది. ఒక వీధిలో ఒక వరుసలో ఉండే దుకాణాల ముందు భాగాలు(ఫసాడ్) అన్నీ ఒకే తరహా నిర్మాణశైలితో కనపడనున్నాయి. వరుస క్రమంలో తీర్చిదిద్దినట్లుండే దుకాణాలన్నీ బయటినుంచి చూసే వారికి ఒకే నమూనాలో కనిపిస్తాయి. దుకాణాల బోర్డులు కూడా అన్నింటికీ ఒకే సైజులో క్రమపద్ధతిలో అమర్చుతారు. చారిత్రక ప్రాధాన్యతతతో పాటు పలు విశేషాలతో ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అలరారుతున్న చార్మినార్‌ను సందర్శించే టూరిస్టులను మరింతగా ఆకట్టుకునేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. చార్మినార్ పాదచారుల పథకం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. స్వచ్ఛ భారత్ మిషన్ చార్మినార్‌ను స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతంగా గుర్తించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చార్మినార్ పరిసరాలకు మరిన్ని వన్నెలద్దేందుకు దాదాపు ఏడాదిన్నర క్రితం జీహెచ్‌ఎంసీ అధికారులు అప్పటి మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి వచ్చారు. అక్కడి దుకాణాలన్నీ ఒకే నమూనాలో ఉండటం, వాహన కాలుష్యం లేకపోవడం, స్వచ్ఛ కార్యక్రమాలు పకడ్బందీగా అమలవుతుండటం తదితరమైనవి ఇక్కడా అమలు చేయవచ్చునని భావించారు. అందులో భాగంగా దుకాణాల ముందు భాగాలన్నీ ఒకే నమూనాలో ఏర్పాటు చేసేందుకు అప్పట్నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ.. స్థానిక వ్యాపారులను ఒప్పించడం, తదితరమైన వాటిలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు పైలట్ ప్రాజెక్టుగా తొలుత మూడు దుకాణాల ఫసాడ్‌ల నిర్మాణానికి సిద్ధమయ్యారు. అందుకు స్థానిక వ్యాపారులను ఒప్పించారు. ఫసాడ్‌ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. దాదాపు రూ.15 లక్షల అంచనా వ్యయంతో వీటి ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. ఇవి పూర్తయితే మిగతావారూ ముందుకొస్తారని భావిస్తున్నారు.
స్వచ్ఛ ఐకాన్‌లో భాగంగా..
దీంతోపాటు స్వచ్ఛ ఐకాన్‌లో భాగంగా చార్మినార్ పరిసరాలను ప్రత్యేంగా తీర్చిదిద్దనున్నారు. ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తూ 24 గంటల పాటు çపరిశుభ్రంగా ఉంచుతారు. పరిసరాల్లో పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతారు. రోడ్డు మార్కింగ్‌లు తదితరమైన వాటితో రహదారులకు మెరుగులద్దుతారు. పర్యాటకుల సదుపాయార్థం స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు చేయనున్నారు. చార్మినార్‌కు నలువైపులా ఉన్న పరిసరాల్లోని చారిత్రక భవనాల్ని పునరుద్ధరించి ప్రత్యేక వెలుగుల్లో మెరిసేలా విద్యుత్ కాంతులద్దుతారు. ఇలా వివిధ కార్యక్రమాలతో పర్యాటకులు మెచ్చేలా చార్మినార్ పరిసరాల్ని మార్చనున్నారు. పర్యాటకుల కోసం రిసెప్షన్ సెంటర్, సైనేజీలు, తగినన్ని టాయ్‌లెట్లు.. మహిళలకు ప్రత్యేకంగా షీ టాయ్‌లెట్లు ఏర్పాటు చేస్తారు. సీసీకెమెరాల ఏర్పాటుతో పాటు పాదచారులు, దివ్యాంగులకు తగిన రవాణా సదుపాయం కల్పిస్తారు. కాలుష్యం లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాల్ని ప్రవేశపెడతారు. చార్మినార్ చుట్టూ బఫర్‌జోన్‌ను ఏర్పాటుచేసి అందులోకి వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటారు.
ఇవీ ప్రత్యేకతలు..
♦ అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం తరహాలో పాదచారులు సాఫీగా నడిచేందుకు తగిన ఏర్పాట్లతోపాటు గజిబిజి..వాహన, ధ్వని కాలుష్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
♦ పరిసరాల్లో పోస్టర్లు, హోర్డింగులు, చెల్లాచెదురుగా వేలాడే విద్యుత్, టెలిఫోన్ వైర్లు లేకుండా తొలగిస్తారు.
♦ అమృత్‌సర్‌లో ఫసాడ్‌ల ఏర్పాటు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఆ విభాగం అధికారులు అక్కడి దుకాణదారులు, వీధి వ్యాపారులతో సహ సంబంధీకులందరితో పలు పర్యాయాలు సంప్రదింపులు జరిపి వారిని ఒప్పించారు. పాత నిర్మాణాలు దెబ్బతినకుండా, వాటినే అందంగా తీర్చిదిద్దారు. ఫుట్‌పాత్‌లకు రంగుల టైల్స్ వేశారు. పరిశుభ్రత పరంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అమృత్‌సర్ దేవాలయానికీ, చార్మినార్‌కు పలు అంశాల్లో సామీప్యతలుండటంతో ఇక్కడా అమలుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment