ఛత్తీస్‌గఢ్ నుంచి మరో 1,000 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సిద్ధంగా ఉందని, ఆ విద్యుత్‌ను పొందేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించా రు. ఆ రాష్ర్టం నుంచి విద్యుత్ సరఫరా కోసం చేపట్టిన లైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ మంత్రితో పాటు సీఎస్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్, ఏటా అందుబాటులోకి రానున్న కరెంట్, విద్యుత్ కేంద్రాల పరిస్థితి, అంతిమంగా సాధించాల్సిన లక్ష్యాలు, ప్రణాళికలు, విద్యుత్ విధానాలపై ఈ సమీక్షలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుతం రాష్ర్టంలో 4,300 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని, డిమాండ్ మాత్రం 6 వేల మెగావాట్ల వరకు ఉందని సీఎం ప్రస్తావించారు.
పురోగతిలో ఉన్న విద్యుత్ కేంద్రాల ద్వారా, కేంద్ర వాటా ద్వారా ఈ ఏడాది చివరి నాటికి మరో 2 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, అప్పటికి కొంత లోటు తీరుతుందని ఆయన వివరించారు. వచ్చే ఏడాది రెండో భాగంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని, సింగరేణి ద్వారా మరో 1080 మెగావాట్ల విద్యుత్ అందుతుందని చెప్పారు. దీంతో వచ్చే ఏడాదిలో మొత్తం 8,500 మెగావాట్ల లభ్యత ఉంటుందన్నారు. దాంతో రైతులకు పగటి పూట ఒకే విడతగా విద్యుత్ అందించవచ్చని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరో మూడేళ్లలో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. అప్పటికి రాష్ట్రంలో 21,350 మెగావాట్ల థర్మల్ విద్యుత్పత్తి జరగాలని, జల విద్యుత్‌ని కలిపితే అది 24,000 మెగావాట్లకు చేరాలని విద్యుత్ శాఖకు లక్ష్యం నిర్దేశించారు. ఇందుకు కాలపరిమితితో కూడిన ప్రణాళికను సిద్ధం చేసి కార్యాచరణలో పెట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అవసరమయ్యే కార్యాచరణ రూపొందించాలని, రేట్ల నిర్ణయం, రైల్వే లైన్ల నిర్మాణం తదితర పనుల విషయంలో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్‌లో జెన్‌కోకు వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించాలని నిర్ణయించారు. కాగా, ఎన్‌టీపీసీ ద్వారా 4000 మెగావాట్లు, జెన్‌కో ద్వారా 6000 మెగా వాట్ల విద్యుత్ ఉద్పత్తి కోసం చేస్తున్న పనులు మూడేళ్లలో పూర్తవుతాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. జల విద్యుత్, సౌర విద్యుత్ కూడా అదనంగా అందుబాటులోకి వస్తుందని, అప్పుడు రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఉంటుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి, కొత్త పరిశ్రమలు, ఎత్తిపోతల పథకాలు, వాటర్ గ్రిడ్, వాణిజ్య, గృహావసరాలకు కావాల్సినంత కరెంట్ అందుబాటులోకి వస్తుందన్నారు. సోలార్ విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముందని, సోలార్ ప్రాజెక్టుల ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని అధికారులకు సీఎం సూచించారు. మణుగూరులో నిర్మించతలపెట్టిన విద్యుదుత్పత్తి ప్లాంటుకు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పేరును ఖరారు చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. దీని నిర్మాణ పనుల కోసం బీహెచ్‌ఈఎల్‌కు ప్రభుత్వం రూ. 350 కోట్లను విడుదల చేసిందన్నారు.