రాష్ట్రానికి ‘లెవీ’ గండం..!
⇒ 25 శాతం కొనసాగింపునకు కేంద్రం విముఖం
⇒ ఇప్పటికే పచ్చి బియ్యం సేకరణ నుంచి తప్పుకున్న ఎఫ్‌సీఐ
⇒ క్రమంగా ఉప్పుడు బియ్యం సేకరణ నుంచీ తప్పుకునే యోచన
⇒ ఇక ధాన్యం సేకరణ భారమంతా రాష్ట్రాలపైనే
⇒ పౌర సరఫరాలశాఖపై ఏటా అదనంగా రూ.100 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే లెవీ విధానాన్ని పూర్తిగా ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కితగ్గేలా లేదు. దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం స్పందించట్లేదు. వ్యవసాయ రంగంపైనే ఆధారపడి పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఉత్పత్తి చేసే తెలంగాణ రాష్ట్రంపై లెవీ భారం ఎక్కువగా ఉంటుందని, ఈ దృష్ట్యా ప్రస్తుతం అమలు చేస్తున్న 25 శాతం లేవీ విధానాన్ని కొనసాగించాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీకి స్వయంగా లేఖ రాసినా ఇంతవరకు ఏ స్పందన లేదు. దీంతో రైతులకు మద్దతు ధర లభించినా గిట్టుబాటు ధరలు దక్కే అవకాశాలు లేకుండా పోనున్నాయి.
గత ఏడాది ఖరీఫ్‌కు ముందు వరకు 75 శాతంగా ఉన్న లెవీని 25 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు కోరినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. బియ్యం లెవీని 25 శాతానికి తగ్గించడం వల్ల మిల్లర్లు తమకు ఉన్న నిల్వ సామర్థ్యం మేరకు బియ్యాన్ని కొనుగోలు చేసి మిగతా మొత్తాన్ని కొనేందుకు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా రావడంతో కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం 1,500 వరకు పెంచడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు అదనంగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది.
25 శాతం లెవీ ఎత్తేస్తే మరింత భారం: ప్రస్తుతమున్న 25 శాతం లెవీనీ కేంద్రం ఎత్తేస్తే రాష్ట్రంపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యాన్ని రాష్ట్రమే సేకరించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తులో ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంలో ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే చిన్నకారు రైతులు, నిల్వ సామర్థ్యం లేని వారికి మద్దతు ధర లభించినా గిట్టుబాటు ధర దక్కే అవకాశాలుండవు.
లెవీ ఎత్తివేతపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదని భావిస్తున్న పౌరసరఫరాలశాఖ పూర్తి బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటోంది. మొత్తంగా రబీలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్న అంచనాపై ఖరీఫ్‌లో ఏర్పాటు చేసిన 1,581 కొనుగోలు కేంద్రాలకు మరో 500 కేంద్రాలు పెంచాలని నిర్ణయించింది. పెరిగిన కేంద్రాలకు అనుగుణంగా గోనె సంచులు, టార్పాలిన్లు, జల్లెడపట్టే యంత్రాలు, మార్కెట్ యార్డుల్లో మరిన్ని వసతులకు కలిపి ప్రభుత్వంపై అదనంగా మరో రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది.
పూర్తిగా తప్పుకోనున్న ఎఫ్‌సీఐ
రాష్ట్రంలో గత ఏడాది మార్చి వరకు కేవలం కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకే పరిమితమైన ధాన్యం సేకరణ వికేంద్రీకరణను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో నిర్ణయించింది. దీంతో పచ్చి బియ్యం సేకరణ నుంచి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) పూర్తిగా తప్పుకున్నట్లైంది. 2012-13లో 7 లక్షల మెట్రిక్ టన్నుల మేర పచ్చి బియ్యం సేకరణ జరిపిన ఎఫ్‌సీఐ, 2013-14లో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. 2014-15లో పచ్చి బియ్యం సేకరణ నుంచి పూర్తిగా తప్పుకొని కేవలం ఉప్పుడు బియ్యం సేకరణకే పరిమితమైంది.
దీంతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పచ్చి బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరిస్తోంది. ఏ జిల్లాలో సేకరించిన ధాన్యాన్ని అక్కడే బియ్యంగా మార్చి ఆ జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంపై ధాన్యం సేకరణ భారం భారీగా పడింది. ఈ పరిస్థితుల్లో లెవీ పూర్తిగా ఎత్తేస్తే ఉప్పుడు బియ్యం సేకరణ నుంచి కూడా ఎఫ్‌సీఐ వైదొలిగే అవకాశాలున్నాయి. ఇది రాష్ట్రాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తిఅయ్యే ఉప్పుడు బియ్యాన్ని ఎవరు సేకరించాలన్నది ప్రభుత్వం ముందున్న ప్రశ్న.