
చీప్‌లిక్కర్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే: డీకే అరుణ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అమలు చేయాలనుకుంటున్న చీప్ లిక్కర్ విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. బుధవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆమె..రాష్ట్రంలో పేద ప్రజల రక్తాన్ని పీల్చే విధంగా చీప్ లిక్కర్ పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని మండిపడ్డారు.
ఇప్పటికే రాష్ట్రంలో మద్యం మత్తులో అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రమాదాలలో ఎక్కువ భాగం మద్యం సేవించడం వల్ల జరుగుతున్నవేనని అనేక నివేదికలు వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడం కోసం పేదలను బలిచేయడం సమంజసంకాదన్నారు. దీనిపై ప్రభుత్వం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.