ఖమ్మం క్రైం : ప్రేమ పేరుతో ఓ మహిళకు చేరువై, కులం పేరు మార్చుకుని ఆమెను పెళ్లాడి, డబ్బు కోసం హింసించి, ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించి తప్పించుకుని పారిపోరుున నయవంచకుడిని రెండేళ్ల తరువాత ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది హైదారబాద్‌లో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం మహిళ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సీఐ అంజలి వెల్లడించారు.ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మద్ది చైతన్యకు వివాహమైన కొద్ది కాలానికే భర్త మృతిచెందాడు.
రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం ఆరియాబాద్‌లో తన అత్తగారింటికి వెళ్లిన ఆమె కొంతకాలం అక్కడే ఉంది. అదే ప్రాంతంలో ఉంటున్న నిజామాబాద్ జిల్లా మాచిరెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన కఠాధ శషాంక్(పూర్తి పేరు శషాంక్ నాయక్)తో పరిచయమేర్పడింది. ఓ సెల్ కంపెనీలో సిమ్స్ కార్డ్స్ సేల్స్‌మన్‌గా చేస్తున్నట్టు చెప్పాడు. అతడు తన పేరు శశాంక్ రెడ్డిగా చెప్పి ఆమెను ప్రేమలోకి దింపి, అక్కడే ఉన్న బాలాజీ టెంపుల్‌లో వివాహమాడాడు. ఆ తరువాత వీరిద్దరినీ చైతన్య తల్లిదండ్రులు చేరదీసి, ఘనంగా వివాహం జరిపించి కాపురానికి పంపారు. ఆరియూబాద్‌లో వీరికి ఓ పాప కూడా జన్మించింది.
కొంతకాలం తర్వాత, తనకు సింగపూర్‌లో ఉద్యోగం వచ్చిందంటూ చైతన్యను నమ్మించి ఆమె బంగారు నగలన్నీ అమ్మాడు. ఇంకా మూడులక్షల రూపాయలు తేవాలంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించసాగాడు. దీనిని తట్టుకోలేని ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించి, శశాంక్ కోసం వెతకగా ఆచూకీ తెలీలేదు. వారు 2013, మే 11నఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శశాంక్ కోసం వెతకసాగారు.
ఎప్పటికప్పుడు సిమ్ కార్డులను మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్న అతనిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని సీఐ అంజలి ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తిరుగుతున్న అతడిని హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకుని ఖమ్మం తీసుకొచ్చారు. వీరిద్దరినీ అభినందిస్తూ నగదు బహుమతిని సీఐ అంజలి అందించారు. కులం పేరు తప్పుగా చెప్పి, కట్నం కోసం వేధించి, పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్నందుకుగాను శశాంక్ నాయక్‌పై కేసులు నమాదు చేసి, అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు నర్సయ్య, జైపాల్‌రెడ్డి, ఏఎస్‌ఐ ఎమిల్‌టన్ పాల్గొన్నారు.
నయవంచకుని అరెస్ట్
Published Sat, Mar 14 2015 3:12 AM | Last Updated on Mon, Jul 29 2019 6:54 PM
Advertisement
Advertisement