- కంచనపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో డీఈఓ తనిఖీ
- హెచ్‌ఎంకు మెమో.. ఇద్దరు టీచర్ల ఇంక్రిమెంట్‌లో కోత
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కొన్ని నెలల క్రితం ఈ తనిఖీలు చేపట్టిన విషయం విదితమే. ఆ తర్వాత వివిధ కారణాలతో నిలిపివేసిన అధికారులు మళ్లీ తనిఖీలకు ఉపక్రమించారు. ఈ మేరకు డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ శుక్రవారం జిల్లాలోని రఘునాథపల్లి మండలం కంచనపల్లిలోని జెడ్పీఎస్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీచేశారు.
వ్యక్తిగత పనిపై వెళ్లిన ఉపాధ్యాయుడికి ఓడీ!
కంచనపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో డీఈఓ తనిఖీ చేసిన సమయంలో హెచ్‌ఎం డి.సమ్మయ్య సెలవులో ఉన్నారు. అయితే, హాజరుపట్టికను పరిశీలిస్తే హెచ్‌ఎం ఎక్కువగా ఓడీలు కూడా వేసుకుంటున్నట్లు తేలింది. మరో ఉపాధ్యాయుడు పవన్‌కుమార్ తన వ్యక్తిగత పనిపై వెళ్లగా అతనికి కూడా హాజరుపట్టికలో ఆన్ డ్యూటీ(ఓడీ) వేశారు. దీంతో హెచ్‌ఎం పనితీరు సంతృప్తికరంగా లేదని గుర్తించిన డీఈఓ ఆయనకు మెమో జారీ చేశారు.
ఇక పవన్‌కుమార్ వ్యక్తిగత పనిపై వెళ్తూ ఓడీ పెట్టినట్లు గుర్తించిన డీఈఓ ఆయన ఒక రోజు వేతనంలో కోత విధించారు. ఆ తర్వాత డీఈఓ విజయ్‌కుమార్ పదో తరగతి విద్యార్థుల ఇంగ్లిష్, సోషల్ స్టడీస్‌లో విద్యా సామర్థ్యాన్ని పరిశీలించగా, వారు చిన్నచిన్న ప్రశ్నలకు సైతం జవాబులు చెప్పలేకపోయారు. ఈ మేరకు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఆర్.అశోక్, పి.సంపత్‌కు రాబోయే అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నట్లు డీఈఓ తెలిపారు.
ఇదిలా ఉండగా తెలుగు, హిందీలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించగా సంతృప్తికరంగా ఉండడంతో ఆయా ఉపాధ్యాయులను డీఈఓ అభినందించారు. కాగా, మండలాల్లో ఎంఈఓలు పాఠశాలలను సరిగ్గా తనిఖీ చేయకపోవడంతో ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, ఇక నుంచి వరుసగా పాఠశాలల తనిఖీలు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ విజయ్‌కుమార్ వెల్లడించారు.