బోగస్ కార్డులకు చెక్
- మళ్లీ ఏరివేత
- కొత్త కార్డుల జారీ
- కుటుంబాలకు మించి కార్డులు
- 2.13 లక్షలు బోగసేనని అనుమానం
కుటుంబాలు 9,76,022
రేషన్‌కార్డులు 11,88,974
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొత్త రేషన్‌కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్త కార్డులు ముద్రించి ఇవ్వటంతో పాటు పనిలోపనిగా బోగస్ కార్డులు ఏరివేయాలని ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో బోగస్ కార్డుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు చేసిన జిల్లా పౌరసరఫరాల విభాగానికి చేతినిండా పని దొరికినట్లయింది. బోగస్ కార్డులతో ముడిపడి ఉన్న రేషన్ డీలర్లు, లబ్ధిదారులకు దడ పుట్టినట్లయింది.
మన జిల్లాకు చెందిన ఈటెల రాజేందర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ ప్రక్రియ సంబంధిత అధికారులకు కత్తిమీద సాములా మారనుంది. ఇప్పటికే జిల్లాలో మండలాల వారీగా బోగస్ కార్డుల వివరాలపై పౌర సరఫరాల విభాగం పక్కాగా సమాచారం సేకరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డుల సంఖ్య పొంతన కుదరటం లేదని తేల్చేసింది. అదే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
శనివారం సీఎం సమక్షంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలోనూ జిల్లాల వారీగా బోగస్ కార్డులెన్ని ఉన్నాయనేది చర్చకు వచ్చినట్లు తెలిసింది. జిల్లాలోని మొత్తం 57 మండలాల్లో 9,76,022 కుటుంబాలు ఉండగా, రేషన్‌కార్డులు 11,88,974 ఉన్నాయి. వీటిలో 8.56 లక్షల తెల్లకార్డులు, రచ్చబండ సమయంలో జారీ చేసినవి 1.10 లక్షల తాత్కాలిక కార్డులు, 74,424 అంత్యోదయ అన్న యోజన కార్డులున్నాయి.
వీటికి తోడు కొత్తగా రేషన్‌కార్డులు కోరుతూ మరో 88 వేల దరఖాస్తులు జిల్లాలోనే పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా కుటుంబాల సంఖ్య కంటే రెండు లక్షలకు పైగా బోగస్ కార్డులున్నట్లు అధికారులు గుర్తించారు. మండలాల వారీగా సమాచారం సేకరించారు. కానీ.. వీటిలో ఏవి అసలు.. ఏవీ నకిలీవో గుర్తించటం సులభ సాధ్యం కాదని.. పక్కాగా సర్వే చేయాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.