రేషన్‌ షాపు తెరవకపోతే రూ.500 ఫైన్‌ | 500 fine on ration dealers in case not open shops | Sakshi
Sakshi News home page

రేషన్‌ షాపు తెరవకపోతే రూ.500 ఫైన్‌

Published Tue, Feb 13 2018 9:01 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

500 fine on ration dealers in case not open shops - Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చౌక ధరల దుకాణాలు తెరవకుండా రోజుల తరబడి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయని డీలర్లపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇకపై ఎవరైనా రేషన్‌ డీలర్‌ దుకాణం తెరవకపోతే ఆరోజు రూ.500 అపరాధ రుసుం చెల్లించాల్సిందే. ఒకవేళ సదరు డీలరు నగదు రూపేణా రుసుం చెల్లించకపోతే వారికిచ్చే కమీషన్‌ నుంచి మినహాయించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించిన కమిషనర్‌ రాజశేఖర్‌ ఈ మేరకు డీలర్లకు స్పష్టం చేశారు. జిల్లాలో 2870 రేషన్‌ షాపులున్నాయి. 12,17లక్షల మంది రేషన్‌ కార్డులు కలిగి ఉన్నారు. ఇందులో 10.84 మంది తెల్లకార్డులు కలిగిన వారున్నారు.

వీరంతా నెలనెలా బియ్యం, చక్కెర, పామాయిల్‌ వంటి నిత్యావసర వస్తువులు తీసుకుం టుంటారు. ప్రతి జిల్లాలోనూ రేషన్‌ సరుకులపై ఆధారపడే నిరుపేద జనం 40 శాతం మంది ఉన్నారు. మన జిల్లాలోనూ వీరు 26 శాతంగా ఉన్నారు. మారుమూల మండలాల్లోని శివారు గ్రామాల్లో చాలాచోట్ల రేషన్‌ షాపులు సరిగ్గా తెరవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా తంబళ్లపల్లి, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి, గంగవరం, కల్లూరు, పుంగనూరు, మదనపల్లి, పీలేరు, ఎర్రావారిపాలెం, కలకడ, శ్రీరంగరాజపు రం, సత్యవేడు, వరదయ్యపాళెం వంటి మండలాల్లోని చాలా గ్రామాల్లో డీలర్లు సొంత పనుల్లో నిమిగ్నమై అడపాదడపా దుకాణాలు తెరవడం లేదు. ఆయా గ్రామాల ప్రజలు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.

పదేపదే చెబుతున్నా..
నిబంధనల ప్రకారం రేషన్‌ షాపులను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 11.30 వరకూ, మధ్యాహ్నం 4 నుంచి 8 గంటల వరకూ తెరిచి ఉంచాలి. వెయ్యికి పైగా గ్రామాల్లో ఉదయం రెండు గంట లు తెరిచి సాయంత్రం దుకాణాలు మూసేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రోజూ తెరవకుండా వారంలో నాలుగైదు రోజులు మాత్రమే షాపులు తెరుస్తున్నారు. దీనివల్ల చేతిలో డబ్బులున్నపుడు సరుకులు తీసుకోవాలన్న జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసమే ఏర్పాటు చేసిన షాపులు కావడంతో తప్పనిసరిగా ప్రతి రోజూ తెరవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం సోమవారం నుంచి కఠిన నిర్ణయం తీసుకుంది. మండలాల వారీగా ఏయే గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు తెరవలేదో గుర్తించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పా టు చేసుకుంంటోంది.  ఏదేని గ్రామంలో ఓ డీలరు నెలలో 4 రోజులు షాపు తెరవకపోతే ఆయనికిచ్చే కమీç Ùన్‌ నుంచి రూ. 2 వేలు మినహాయించుకునేందుకు పౌరసరఫరాల శాఖ   నిర్ణయించుకుంది.

ప్రజలకు అందుబాటులో ఉండాలి...
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్‌ డీలర్లు కచ్చితంగా రోజూ దుకాణాలు తెరవాలి. కార్డు హోల్డర్లకు అందుబాటులో ఉంటూ సరుకులు పంపిణీ చేయాలి. లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవు. రేషన్‌ దుకాణాల పనితీరు, సమయపాలనపై సమగ్రమైన వివరాలు తెప్పించుకుంటున్నాం.- చాముండేశ్వరి,జిల్లా పౌరసరఫరా శాఖ అధికారిణి. చిత్తూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement