రసాయనాలు పేలి ఇద్దరి దుర్మరణం
- మరొకరికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం
కరీంనగర్: కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని ఓ ఇంట్లో శనివారం రాత్రి రసాయన పదార్థాలు పేలడంతో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా కొడకండ్లకు చెందిన పెంటం నాగార్జునకుమార్(35), పెంటం శ్రీనివాస్‌కుమార్(34), మల్ల రామ కృష్ణారెడ్డి(42) హౌసింగ్‌బోర్డులోని ఓ ఇంట్లో రసాయన పదార్థాలతో బొమ్మలు చేస్తూ దుకాణాలకు సరఫరా చేస్తుండేవారు.
శనివారం ఎప్పటిలాగే బొమ్మలు తయారు చేయగా.. మిగిలిన పదార్ధాలను ఇంటి సమీపంలో పారేశారు. అక్కడ మధ్యాహ్నం సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. కాగా ఎక్స్‌పెయిరీ డేట్ ముగిసిన హార్డినర్ పౌడర్‌లో నీళ్లు కలిపి పారబోసేద్దామని ఆదివారం శ్రీనివాస్ ప్రయత్నించగా అది పెద్ద శబ్దంతో పేలి మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో నాగార్జునకుమార్, మల్ల రామకృష్ణారెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. శ్రీనివాస్ చేతులు తెగిపోయాయి.
కాళ్లు ఇతర భాగాలు నుజ్జునుజ్జుయ్యాయి. పేలుడు ధాటికి గదిలోని కిటికీలు, తలుపులు దూరంగా ఎగిరిపడగా ఒక పక్క గోడ పూర్తిగా బద్దలైంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌కుమార్‌ను హైదారాబాద్‌కు తరలించారు.