సాక్షి సిటీబ్యూరో: సిటీలో చికెన్, మటన్ రేట్లు మండిపోతున్నాయి. ఎండలకు పోటీపడుతూ రోజురోజుకు మాంసాహారులకు ఇవి ప్రియంగా మారుతున్నాయి. రంజాన్ నెల రాకతో ప్రస్తుతం మార్కెట్‌లో మాంసానికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా జంటనగరాల్లో చికెన్ కొరత తీవ్రంగా ఉంది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్లే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఫామ్‌లలో బర్డ్స్ (కోళ్లు) లేకపోవడంతో ధరలు పెంచేస్తున్నారు. సాధారణ రోజుల్లో జంట నగరాల్లో రోజుకు దాదాపు 600 నుంచి 750 టన్నులకు పైగానే చికెన్ వినియోగం అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. ఇక ఆదివారం, పండగ రోజుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు రంజాన్ నెలలో ముస్లింలు ఎక్కువగా నాన్ వెజ్ ఆరగిస్తారు. హోటళ్లలో హలీంతో పాటు, ఇతర నాన్‌వెజ్ వంటకాలు కూడా ఎక్కువగా తయారు చేస్తారు. కానీ ప్రస్తుతం వేసవిలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
వేడిని తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శివారు ప్రాంతాల్లో దాదాపు 80 వేల వరకూ కోళ్లఫారాలు ఉన్నాయి. వీటి నుంచే ప్రతి రోజూ నగరంలోని చికెన్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొద్దిమొత్తంలో కోళ్లను దిగుమతి చేసుకుంటున్నట్టు వ్యాపారులు తెలిపారు. జంటనగరాల్లో దాదాపు 10 వేలకు పైగా చికెన్ వ్యాపారులు ఉన్నారు. సాధారణ రోజుల్లో ఒక్కో వ్యాపారి రోజుకు 700 నుంచి 1500 కేజీల చికెన్ అమ్మకాలు చేస్తున్నారు. ఇక రంజాన్ మాసంలో రోజుకు 2 వేల కేజీల వరకు విక్రయాలు జరుగుతాయి. అయితే కోళ్ల సరఫరా తగ్గిపోవడంతో అమ్మకాలు కూడా తగ్గినట్టు రాంనగర్‌లోని హోల్‌సేల్ చికెన్‌వ్యాపారి లింగరాజు వెల్ల్లడించారు. నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర స్కిన్‌లెస్ కిలోకు 160 రూపాయలు ధర పలికింది. ప్రస్తుతం కిలో రూ.220 నుంచి 250 వరకు పలుకుతోంది. ఇక స్కిన్‌తో కలిపి అమ్మే చికెన్ కిలో రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.180 రూపాయలకు అమ్ముతున్నారు. లైవ్‌బర్డ్ (కోడి) అయితేకిలో రూ. 130 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ.160 రూపాయలు పలుకుతోంది. వేసవి ఎండలు తగ్గుముఖం పట్టే వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
మటన్‌దీ అదే దారి
చికెన్ రేట్లు చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు మటన్ మాటెత్తడానికి జంకుతున్నారు. మటన్‌ధర కూడా భారీగా పెరిగింది. రెండు నెలల క్రితం వరకూ కిలో మటన్ ధర రూ.550 ఉండగా, ప్రస్తుతం 600 నుంచి 650 రూపాయలకు పెరిగింది. దీంతో మటన్ కొనుగోలు చేయలేని చాలామంది చికెన్‌తో సరిపెట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment