ఇరు రాష్ట్రాల సిఎంలు స్పందించాలి
సికింద్రాబాద్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాద ఘటన చాలా విచారకరం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు 26 మంది విద్యార్థులు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థులను చూసేందుకు ఆయన యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై మానవతా దృక్పధంతో స్పందించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. విషాదకర సంఘటన జరిగినపుడు ప్రభుత్వం మానవత్వం చూపించాలన్నారు. రైల్వేశాఖ స్పందించి నష్టపరిహారం అందించాలని కిషన్ రెడ్డ కోరారు. డ్రైవర్ చేతిలో పసిపిల్లల ప్రాణాలు ఉంటాయి. అందువల్ల డ్రైవర్లకు కౌన్సిలింగ్ అవసరమన్నారు. విద్యాశాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు. రైల్వే క్రాసింగ్ ఉన్న అన్ని చోట్ల కాపలా మనుషులను పెట్టే విధంగా రైల్వే శాఖపై ఒత్తిడి తేవాలన్నారు. తాను కూడా ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడతానని చెప్పారు.