మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి పనిలో ఉండగా..
- సుమోటోగా కేసు నమోదు
- పరిశ్రమ ఎదుట పార్టీల ఆందోళన
హత్నూర: పాల కోసం ఏడ్చి..ఏడ్చి పసిబాలుడు మృతి చెందిన ఘటనపై సోమవారం అధికారులు సుమోటోగా కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి పనిలో ఉండగా.. తన ఆరునెలల బాలుడికి పాలు ఇచ్చేం దుకు కాంట్రాక్టర్ అనుమతించకపోవడంతో ఏడ్చి.. ఏడ్చి సొమ్మసిల్లిన బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం జిల్లా న్యాయసేవ సాధికారత సంస్థ (లీగల్ సెల్) కార్యదర్శి, న్యాయమూర్తి కనకదుర్గ, చైల్డ్‌లైన్ సంస్థ జిల్లా డెరైక్టర్ ఉమేష్‌చంద్ర, తహశీల్దార్ ప్రతాప్‌రెడ్డి, సీఐ రాంరెడ్డి, ఎస్‌ఐ పెంటయ్యలు పరిశ్రమకు వెళ్లి ఘటనపై విచారణ చేపట్టారు. బాలుడి మృతిపై సుమోటోగా కేసు నమోదు చేశామని, బాధితురాలు మల్లీశ్వరి ఫిర్యాదు ఇచ్చే తీరును బట్టి కేసు విచారణ ముందుకు సాగుతుందన్నారు.
రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
కాంట్రాక్టర్ పని ఒత్తిడి వల్లే వలస కూలీ మల్లేశ్వరి తన కుమారుడిని కోల్పోవాల్సి వచ్చిందని బాధితురాలికి పరిశ్రమ యాజమాన్యం, సదరు కాంట్రాక్టర్ రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా కా ర్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం తదితరులతో కలసి ప రిశ్రమ ఎదుట ఆందోళన చేశారు.
చిన్నారి మృతిపై స్పందించిన లోకాయుక్త
ఓ కాంట్రాక్టర్ కూలీగా పనిచేస్తున్న తల్లిని పాలివ్వకుండా అడ్డుకొని ఆరు నెలల బాబు మృతికి కారణమైన విషాద ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి సోమవారం మెదక్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. గురువారంలోగా నివేదికను ఇవ్వాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అమానుషంగా ప్రవర్తించి, బాబు మృతికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని బాధిత మహిళకు ఆర్థికసాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను లోకాయుక్త విచారణకు స్వీకరించారు.