
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ దుర్గానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సత్యసాయి అపార్ట్‌మెంట్‌లో ఎలాంటి రక్షణలేని లిఫ్ట్.. పదేళ్ల పసిబాలుడి ప్రాణాల్ని మింగింది. ఆదివారం ఉదయం ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
దుర్గానగర్‌లోని సత్యసాయి అపార్ట్‌మెంట్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి గతకొంతకాలంగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు పదేళ్ల కొడుకు తస్సావంత్ ఉన్నాడు. ఆదివారం ఉదయం బాలుడు ఆడుకుంటూ.. లిఫ్ట్ కోసం ఏర్పాటుచేసిన బేస్‌గుంతలోకి తొంగిచూస్తుండగా కిందకు దూసుకొచ్చిన లిఫ్ట్ అతని తలకు బలంగా తగిలింది. దీంతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలుడి మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌కు ఎలాంటి రక్షణలు లేకపోవడంతోనే బాలుడు మృతిచెందాడని, అపార్ట్‌మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ మున్సిపాలిటీ సిబ్బంది లిఫ్ట్‌ల విషయంలో నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారా? లేదా? అన్నది చూడకుండానే అపార్ట్‌మెంట్లకు అనుమతులు ఇస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
లిఫ్ట్ తలపై పడి పదేళ్ల బాలుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment