
సాక్షి, సిటీబ్యూరో: వేసవి వచ్చిందంటే చాలు. పిల్లలకు ఎంతో ఆటవిడుపు.. ఆహ్లాదం. స్కూల్ కోసం పరుగులు ఉండవు. పరీక్షల ఒత్తిళ్లు ఉండవు. ఇంటిల్లిపాదీ కలిసి టూర్‌లకు వెళ్లొచ్చు. రోజంతా సరదాగా ఆటా పాటలతో గడిపేయవచ్చు. ఇలా వేసవికాలం పిల్లలకు ఎన్నో మరిపోలేని జ్ఞాపకాలను కానుకలుగా ఇస్తూంటుంది. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు.. కొంతమంది బాలికలకు వేసవి శాపంగా మారుతోంది. వారి భావి జీవితంపై చండ్రనిప్పులు కురిపిస్తోంది. బాల్య వివాహం రూపంలో బంధిస్తోంది. ఎనిమిదో తరగతి నుంచో తొమ్మిదో తరగతికో, తొమ్మిది నుంచి పదికి వెళ్లే పిల్లల కలలను కల్లలు చేస్తోంది. పదోతరగతి పాసై, ఇంటర్, డిగ్రీలు పూర్తి చేసి గొప్ప పేరు తెచ్చుకోవాలనుకొనే ఎంతోమంది అమ్మాయిలకు వేసవి నిజంగా ఒక శాపంగానే మారుతోంది. ఈ వేసవిలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 11 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు.పిల్లల సంక్షేమ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, వివిధ సంస్థల అంచనాల మేరకు తమ దృష్టికి వచ్చిన వాటిలో ఏటా 250 నుంచి 300 వరకు బాల్య వివాహాలను నిలిపివేసి తిరిగి ఆ పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల దృష్టికి రాకుండా అంతకంటే రెట్టింపు సంఖ్యలోనే చిన్నారి పెళ్లి కూతుళ్లు బాల్యవివాహాల్లో బందీలవుతున్నారు.
వేసవి మంటలు..
గత నెల మార్చి నెలలో నాచారానికి చెందిన ఓ విద్యార్థిని ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తోంది. కానీ ప్రమాదం ఏ క్షణంలో, ఎటు వైపు నుంచి పొంచి ఉందోననే భయం, ఆందోళన ఆమెను కొద్ది రోజులుగా వెంటాడుతూనే ఉంది. ఊహించినట్లుగానే కుటుంబసభ్యులు ఆమెకు పెళ్లి నిశ్చయించారు. అప్పటికింకా పరీక్షలు పూర్తి కాలేదు. ముహూర్తం కూడా ఖరారైంది. ఒకే ఒక్క పరీక్ష మిగిలింది. ఆ రోజే ఆ అమ్మాయిని పెళ్లి పీటలపైకి ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. సరిగ్గా అదే సమయంలో సమాచారం అందుకున్న అధికారులు, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు బాల్య వివాహానికి బ్రేకులు వేశారు. అమ్మాయికి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందనే ఉద్దేశ్యంతో చాలామంది తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అమ్మాయిలను బలిపీఠంపైకి ఎక్కిస్తున్నారు. ‘ఎనిమిదో తరగతి చదివే అమ్మాయికి పెళ్లి చేస్తారు. పైగా పెళ్లి కూతురుకు, పెళ్లి కొడుక్కు మధ్య కనీసం పదేళ్ల తేడా ఉంటుంది. అలాంటి అమ్మాయిలు చిన్న వయస్సులోనే పిల్లల్ని కంటూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నార’ని ఆందోళన వ్యక్తం చేసింది శంషాబాద్‌కు చెందిన కమలమ్మ. స్థానికంగా మహిళా సంఘాలు, పోలీసులతో కలిసి ఆమె ఇప్పటి వరకు 150 పెళ్లిళ్లను అడ్డుకోగలిగారు. శంషాబాద్ చుట్టుపక్కల గ్రామాలతో పాటు, రాజేంద్రనగర్, ఆరాంఘర్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఎన్నో బాల్యవివాహాలను అడ్డుకున్నటట్లు ఆమె చెప్పారు. ఇటీవల రామంతాపూర్‌లో ఇలాంటి వివాహాన్నే అధికారులు అడ్డుకున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని తన అక్కకు పిల్లలు పుట్టడం లేదనే నెపంతో బావకు ఇచ్చి కట్టబెట్టేందుకు ప్రయత్నించారు. జిల్లెలగూడలోనూ తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి పెళ్లిని అధికారులు ఆపగలిగారు. చాలా చోట్ల కుటుంబాల్లో తమకు జరిగే అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం లేక అమ్మాయిలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాలల హక్కుల సంఘం వంటి సంస్థలను, పోలీసులను ఆశ్రయిస్తున్నారు. క్లాస్‌మేట్స్ సహాయంతో సమాచారాన్ని చేరవేస్తున్నారు. అలాంటి అవకాశం లేని పిల్లలు మాత్రం బాల్యవివాహంతో బందీలవుతున్నారు.
కమలమ్మ అంటే హడల్..
శంషాబాద్‌కు చెందిన అరవై ఏళ్ల కమలమ్మ ఇప్పుడు ఇలాంటి బాల్యవివాహాలపైన కొరడా ఝళిపిస్తున్నారు. ఆమె పెద్దగా చదువుకోకపోయినా బాల్య వివాహాల వల్ల ఏ విధమైన అనర్థాలు జరుగుతాయో తెలిసిన ఆమె ఎక్కడైనా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే వెళ్లిపోతారు. వివరాలు తెలుసుకొంటారు. అక్కడిక్కడే అధికారులకు సమాచారం చేరవేస్తారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో ఒత్తిళ్లను సైతం ఎదుర్కొంటున్నారు. ‘ఆ పిల్లల తల్లిదండ్రులు నన్ను తిట్టుకోవచ్చు. కానీ చిన్న వయస్సులో పెళ్లి జరిగితే ఎలాంటి బాధలు ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించాను. ఎంతోమందిని చూశాను. చాలా మంది గర్భాశయ సంబంధమైన జబ్బులకు గురవుతున్నారు. చిన్నవయసులోనే కుటుంబ భారం మోయలేక ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు. రక్తహీనత కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా చిన్న వయస్సులో జరిగే పెళ్లి తర్వాత ఆ పిల్లల జీవితంలో మిగిలేది చీకటే కానీ వెలుగు మాత్రం కాద’ని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బాల్య వివాహాలను అడ్డుకోవడమే కాకుండా పిల్లలపై జరిగే అనేక రకాల నేరాల నియంత్రణ కోసం కమలమ్మ ఉద్యమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment