
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలో అవగాహన కల్పిస్తున్న అధికారులు (ఫైల్)
పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రేమమైకం
సాక్షి, మెదక్: ప్రభుత్వం, బాలల పరిరక్షణ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా బాల్యవివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏమి తెలియని పసి ప్రాయంలోనే మూడుముళ్ల బంధం వారిని ఛిన్నాభిన్నం చేస్తోంది. ఏటేటా బాల్యవివాహాల సంఖ్య తగ్గుతున్నా.. పూర్తిస్థాయిలో అరికట్టలేకపోవడం గమనార్హం. చైతన్యం కొరవడడంతోపాటు ఆర్థిక స్థోమత లేకపోవడం, బాలికలు భారం అనే భావనతో గతంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం వీటితోపాటు ఇటీవల పుట్టకొచ్చిన కొత్త ‘ట్రెండ్’ తల్లిదండ్రులను బాల్యవివాహాలకు పురిగొల్పుతోంది. తెలిసీ తెలియని వయసులో ప్రేమ, అఫైర్లతో కటుంబం పరువు వీధిన పడుతుందనే కారణంతో ఇష్టం లేకున్నా బాల్య వివాహానికి సిద్ధపడినట్లు ఇటీవల వెలుగు చూసింది. అంతేకాదు.. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో చేసేది లేక పసి ప్రాయంలోనే మూడు ‘ముళ్లు’ వేయించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
20శాతం మేర బాల్య వివాహాలు..
పిల్లల్ని ఎక్కువగా చదివించే ఆర్థిక స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడం, పేదరికం, చిన్నారులపై లైంగిక వేధింపులు, అభద్రతా భావం, వివాహంం చేసేస్తే తమ బాధ్యత అయిపోతుందని తల్లిదండ్రులు భావిస్తుండడంతో తండాల్లో అధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, 2006 బాల్య వివాహ నిషేధ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చైల్డ్ మ్యారేజెస్ కొంత తగ్గు ముఖం పట్టాయి. సుమారు 20 శాతం మేర మార్పురాలేదు.
జిల్లాల వారీగా ఇలా..
మెదక్ : జిల్లాలో అధికంగా నర్సాపూర్ డివిజన్‌లోని నర్సాపూర్, కౌడిపల్లి, చిలిప్‌చెడ్, శివ్వంపేటతోపాటు రామాయంపేట మండల పరిధిలో బాల్యవివాహ ఘటనలు అధికంగా ఉన్నాయి, నాలుగేళ్ల పరిధిలో సుమారు పది నుంచి 12 వరకు బాల్యవివాహాలు జరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం.
సంగారెడ్డి: బాలల పరిరక్షణ అధికారుల లెక్కల ప్రకారం జిల్లా పరిధిలో కంది, పుల్‌కల్, పటాన్‌చెరు, నారాయణఖేడ్, నాగిల్‌గిద్ద మండలాల్లో బాల్యవివాహాలు అధికమని రికార్డులు చెబుతున్నాయి.
సిద్దిపేట: జిలాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా మద్దూరు, హుస్నాబాద్ మండల పరిధిలో జరుగుతున్నట్లు బాలల పరిరక్షణ అధికారులు చెబుతున్నారు.
పరువు కోసం..
నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట తండా.. 17 సంవత్సరాలు ఉన్న ఓ అమ్మాయి 22 ఏళ్ల అబ్బాయితో ప్రేమలో మునిగింది. వారిద్దరి మధ్య అఫైర్ ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. పరువు పోతుందనే కారణంతో ఇష్టం లేకున్నా వారి తల్లిదండ్రులు పెళ్లికి సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న బాలల పరిరక్షణ అధికారులు, సిబ్బంది పెళ్లి రోజునే వివాహం నిలిపివేసి.. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
చదువు మధ్యలో ఆపించి..
మెదక్ జిల్లా రామాయంపేట.. ఓ తండాలో 17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. చుట్టాలింటికి వెళ్లినప్పుడు ఆ బాలికకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతడికి 22 ఏళ్లు ఉంటాయి. డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసిన అతడు వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేమించిన వ్యక్తితో ఇప్పుడే పెళ్లి చేయాల్సిందేనని అమ్మాయి పట్టుబట్టడంతో చేసేది లేక తల్లిదండ్రులు పెళ్లికి సిద్ధం చేశారు. అరగంటలో మూడు ముళ్ల ముహూర్తం ఉందనగా ఐసీపీఎస్ అధికారులు రంగంలోకి దిగి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. అమ్మాయికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
పదిహేనేళ్లకే..
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిప్‌చెడ్ మండలంలోని తోపయతండా.. 15 ఏళ్ల బాలికకు, 22 ఏళ్ల అబ్బాయితో వివాహం కుదిరింది. బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఆలస్యంగా అందింది. వారు వెళ్లేసరికి వివాహం కాగా.. ఆ అమ్మాయి, అబ్బాయికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత దీనికి సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కృషి చేస్తున్నాం..
బాల్యవివాహాల నివారణకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఎక్కడైతే బాల్యవివాహం జరిగిందో.. అక్కడే కౌన్సెలింగ్ ఇస్తున్నాం. పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేస్తున్నారు. సదరు బాలిక చదువుకుంటున్న పక్షంలో కేజీబీవీలు, ఇతరత్రా గు రు కుల పాఠశాలల్లో ఆశ్రయం కల్పిస్తున్నాం.– కరుణశీల, మెదక్ జిల్లాబాలల పరిరక్షణ అధికారిణి
ఈ తండా.. పిల్లల పెళ్లిళ్లకు అడ్డా
చిలప్‌చెడ్(నర్సాపూర్): చిలప్‌చెడ్ మండలం (మెదక్ జిల్లా)లోని టోప్యా తండా బాల్య వివాహాలకు అడ్డాగా మారింది. ఈ నెలలోనే ఓ బాలికకు తల్లితండ్రులు వివాహం చేయగా ఐసీడీఎస్ అధికారులు.. ఆ బాలికను ఐసీడీఎస్ కేంద్రానికి తరలించారు. మరో బాలికకు ఈ నెల 11 వివాహం తలపెట్టగా, అధికారులు అడ్డుకుని మైనార్టీ తీరేవరకు పెళ్లి చేయబోమని వారి తల్లితండ్రులతో హామీ పత్రం రాయించుకున్నారు. గతంలోనూ ఈ తండాలో పలు బాల్య వివాహాలు జరిగిన ఉదంతాలున్నాయి.
మా తండాలో ఇది మామూలు విషయం
కౌడిపల్లి మండలంలోని రాజిపేట జాజితండా పంచాయతీ జగ్యతండాకు చెందిన వ్యక్తికి ఆరుగురు సంతానం. ఇందులో ముగ్గురు ఆడా పిల్లలు, ముగ్గురు మగపిల్లలు. రెండో కూతురు (16)మైనర్ బాలిక. గతేడాది పదవ తరగి చదివి ఇంటివద్ద ఉంటుంది. దీంతో బాలిక పెళ్లి చేయాలనుకున్నాడు. అనంతరం ధర్మాసాగర్‌గేట్‌తండాకు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో పెళ్లి వాయిదా వేశారు.
చిన్నప్పుడుచేస్తే మంచిగుండదని తెలియదు..
బాలికకు చిన్నతనంలో పెళ్ళిచేయవద్దని అంటే తనుకు తెలియదని చెప్పాడు. ఆరుగురు సంతానం కాగా అందులో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఎలాగు పెళ్లిల్లు చేయాల్సిందే కాబట్టి చేయాలన్న ఉద్ధేశంతో చిన్న పిల్లలైన చేస్తున్నాం. తండాలలో ఇలా చేయడంమాములు విషయమే అన్నాడు. తనది సాధారణ వ్యవసాయ కుంటుంబం. పెళ్లిల్లు చేస్తే బాధ్యత తీరుతుందని చేయాలనుకున్నా. 18 ఏళ్లు నిండితే బాగుంటుందని అధికారులు చెప్పారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి డబ్బులు ఇస్తుందని చెప్పారు. కాబట్టి పెళ్లి ఆపివేశానని చెప్పాడు.