బాల్యవివాహాలను అరికట్టేందుకు అధికారులు చర్యలెన్ని చేపడుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా.. తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా చాటుమాటుగా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో 50 రోజుల వ్యవధిలో ఆరు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మరికొన్ని చాటుమాటుగా జరిగినట్లు తెలుస్తోంది. అభద్రత, నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
సాక్షి, యాదాద్రి : ప్రజల అజ్ఞానం, నిరక్షరాస్యత, బాలికలపై అభద్రతాభావంతో బాల్య వివాహాలు జిల్లాలో జరుగుతున్నాయి. 13, 14 ఏళ్ల వయసులోనే బాలికల వివాహం చేసి అత్తింటికి పంపిస్తున్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల కుటుంబాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చోటు చేసుకున్న సంఘటనలు చూస్తే తెలుస్తోంది. అధికారులకు అందిన సమాచారం మేరకు కొంత మేరకు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రించలేక పోతున్నారు. జిల్లాలోని 16మండలాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. హైదరాబాద్ శివారులో గల అభివృద్ధి చెందుతున్న భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం, తుర్కపలి లాంటి మండలాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
రెండేళ్ల కాలంలో పలు ఘటనలు
బీబీనగర్ మండలంలోని రెండేళ్ల కాలంలో నాలుగు బాల్య వివాహాలను అధికారులు నిలిపివేయించారు. 2016లో జియాపల్లి తండా, 2017లో రుద్రవెళ్లి, కొండమడుగు, యాపగానితండాలో, మోత్కూరు మండలంలో తొమ్మది బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మోత్కూరు మండలం కొండగడప, దాచారంలో ఒక్కటి, అడ్డగూడూర్ మండలం కంచనపల్లిలో మూడు, అడ్డగూడూర్, హజీంపేట, మంగమ్మగూడెం, గట్టుసింగారం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున అడ్డుకుని వారి తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే రాజాపేట మండలం నెమిలో ఒకటి, సంస్థాన్ నారాయణపురం మండలంలో మూడు జరిగాయి. వీటిలో బాల్యవివాహాలలో రెండు ఘటనలు తండాల్లో జరిగినవి కాగా, ఒకటి ఉన్నత వర్గానికి చెందినది. వీటిని రెవెన్యూ, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, చైల్డ్‌కేర్ ప్రతినిధులు బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అడ్డుకట్ట పడడం లేదు. గడిచిన 45 రోజుల్లో జిల్లాలో ఆరు బాల్య వివాహాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
కల్యాణలక్ష్మికి దూరం
ఆడ పిల్ల పెళ్లి కోసం పభుత్వం కల్యాణ లక్ష్మి పథ కం కింద ఆర్థిక సాయం అందజేస్తోంది. బాల్య వి వాహాలు చేస్తే ఈ పథకానికి అర్హులు కారు. అయి తే కొందరు అధికారులు కల్యాణలక్ష్మి పథకాన్ని బాల్య వివాహం చేసుకున్న వారికి కూడా వర్తింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు(ఎం) మండలంలో బాల్య వివాహం జరిగిన బాలిక కుటుంబానికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేశారు. ఈవిషయంలో అధికారులు విచారణ కూడా చేపట్టారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, 21 ఏళ్లు నిండిన యువకుడితో వివాహం జరిగితే కల్యాణ లక్ష్మి పథకంలో అర్హత సాధిస్తారని అధికారులు చెబుతున్నారు.
నిరక్ష్యరాస్యత, పేదరికం
గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరిగేందుకు నిరక్షరాస్యత, పేదరికం, ఆర్థిక భారం, ఆడపిల్లంటే అభద్రతాభావం ప్రధాన కారణాలని తెలుస్తోంది. కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెకు వివాహం చేయడానికి ఆర్థిక స్థోమత ఎక్కడ అడ్డువస్తుందోన ని చిన్న వయస్సులోనే పెళ్లి చేస్తున్నారు.ఆడపిల్ల ఏ దో ఒక రోజు బయటకు వెళ్లాల్సిందేనని, అదేదో వచ్చిన మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవా లని అని కూడా బాల్య వివాహాలు చేస్తున్నారు.
ఫిబ్రవరి నుంచి మార్చి 19 వరకు వెలుగుచూసినవి..
ఫిబ్రవరి 1న : తుర్కపల్లి మండలం ముల్కలపల్లి పంచాయతీ కిమ్యాతండా
ఫిబ్రవరి 27న : తుర్కపల్లి మండలం గొల్లగూడెం పంచాయతీ పరిధిలో రామోజీనాయక్ తండాలో
మార్చి 2న : వలిగొండ మండలం పహిల్వానర్‌పురంలో
మార్చి 10న : సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్‌లో
మార్చి 12 : తుర్కపల్లి మండలం దత్తాయపల్లిలో
మార్చి 19 : భువనగిరి మండలం పచ్చబొర్లతండాలో
18వివాహాలు అడ్డుకున్నాం
జిల్లాలో 18 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. జిల్లా ఆవిర్భావం తర్వాత ఆలేరు, మోత్కూర్, భువనగిరి, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో జరిగిన బాల్య వివాహాలపై స్పందించాం. వెంటనే అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాలను అడ్డుకున్నాం. బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలు అందవు. చట్టపరంగా శిక్షలు ఉంటాయి. –జిల్లా మహిళా సంక్షేమాధికారి శారద
Comments
Please login to add a commentAdd a comment