‘ధూమపానం’పై బడి పిల్లల ఉద్యమం  | Childrens movement on smoking | Sakshi
Sakshi News home page

‘ధూమపానం’పై బడి పిల్లల ఉద్యమం 

Published Sun, Dec 9 2018 3:30 AM | Last Updated on Sun, Dec 9 2018 3:30 AM

Childrens movement on smoking - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధూమపానం నిర్మూలనపై పాఠశాల విద్యా శాఖ సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. భావి పౌరులతోనే ధూమపాన వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలను స్మోక్‌ ఫ్రీ, టొబాకో ఫ్రీ స్కూల్‌గా ప్రకటించాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా పాఠశాలల ఆవరణలో పొగ తాగడాన్ని పూర్తిగా నిషేధించాలనేదే విద్యా శాఖ లక్ష్యం. ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని, ప్రతి నెలా క్రమం తప్పకుండా పర్యవేక్షించి నివేదికను ఉన్నతాధికారులకు పంపాలని పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. సిగరెట్స్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్ట్స్‌ యాక్టు–2003 ప్రకారం ప్రతి విద్యా సంస్థ తప్పకుండా నిబంధనలు పాటించాలని అందులో పేర్కొన్నారు. 

ఏం చేయాలి.. 
ముందుగా ప్రతి పాఠశాలలో ‘నో స్మోకింగ్‌/స్మోక్‌లెస్‌ టొబాకో’బోర్డులు ఏర్పాటు చేయాలి. టొబాకొ ఫ్రీ కేంద్రంగా విద్యా సంస్థలు స్వీయ ప్రకటన చేయాలి. జిల్లా విద్యాశాఖ అధికారి తన జిల్లా పరిధిలోని అన్ని విద్యా సంస్థలను టొబాకో ఫ్రీ ఇన్‌స్టిట్యూట్స్‌గా సర్టిఫై చేయాలి. క్షేత్రస్థాయిలో ధూమపాన నిషేధం అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలి. నెలవారీ నివేదికలను జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యాశాఖకు సమర్పించాలి.  

పొగాకు నియంత్రణ అత్యంత ఆవశ్యకం.. 
గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకొ సర్వే ఆఫ్‌ ఇండియా 2016–17 నివేదిక ప్రకారం తెలంగాణలో 17.8 శాతం మంది పెద్దలు (15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ) పొగాకు లేదా పొగాకు ఉత్పత్తుల్ని ఉపయోగిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల ఆరోగ్యం క్షీణించడం, వ్యాధులు రావడం, వైకల్యం, చివరికి మరణం సంభవించడం వంటి వైపరత్యాలు చోటుచేసుకునే ప్రమాదముంది. రాష్ట్రంలో పొగాకు నియంత్రణ అత్యంత ఆవశ్యక అంశంగా పరిగణించాలని ఆ నివేదిక సూచించింది.  
చట్టం ఏం చెబుతోంది.. 
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్, ప్రొడక్షన్, సప్లయి అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌) 2003 చట్టం (కోప్టా) సెక్షన్‌ 6 ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధం. విద్యా సంస్థలకు 100 గజాల కంటే తక్కువ దూరంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. కోప్టా చట్టం సెక్షన్‌ 6 (బి) ప్రకారం విద్యా సంస్థలకు 100 గజాలలోపు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమంటూ సూచిక బోర్డుల్ని ఏర్పాటు చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement