
నల్లగొండ జిల్లా చిట్యాలలో స్థానిక ఎస్‌ఐ ఎ. రాములు ఓటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాలలో స్థానిక ఎస్‌ఐ ఎ. రాములు ఓటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించారు. నోటికి వచ్చినట్టు పరుష పదజాలంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఓటర్లపై జులుం ప్రదర్శించారు.
ఎన్నికల విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌కు కనీసం బ్యాచ్ నెంబర్, నేమ్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. ఒకపక్క ఫెండ్లీ పోలీసింగ్ అని చెబుతూ మరొపక్క సామాన్య జనంతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి రౌడీ పోలీసులకు ముకుతాడు వేయాలని జనం కోరుకుంటున్నారు. దురుసుగా ప్రవర్తించిన చిట్యాల పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు స్థానికులు తెలిపారు.