
సాక్షి, కరీంనగర్ : చొప్పదండి మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ వింతప్రవర్తన వివాదాస్పదంగా మారింది. మహిళా ఉద్యోగిని లోబరుచుకునేందుకు విందు ఏర్పాటు చేశారని స్థానికంగా విమర్శలున్నాయి. తొలుత ఫోన్‌లో ఆమెను లోబర్చుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో విందు భోజనం పేరుతో ఉద్యోగులందరినీ ఆయన ఇంటికి పిలిచారని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులను విందుకు ఆహ్వానించారని సమాచారం. ఈ తతంగం నచ్చని ఓ మహిళా ఉద్యోగి మీడియాకు సమాచారం ఇచ్చారు. అక్కడికి మీడియా వెళ్ళడంతో కమిషనర్ పరార్ అయ్యారు.
ఇటీవలనే మున్సిపాలిటిగా ఏర్పడిన చొప్పదండికి కమిషనర్‌గా 15రోజుల క్రితం హైదరాబాద్ నుంచి నిత్యానంద్ బదిలీపై వచ్చారు. అప్పటి నుంచే మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ క్రింద పనిచేసే మహిళా ఉద్యోగులపై కన్నేశాడని సమాచారం. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగినిలకు గిఫ్ట్‌లు ఇచ్చేవారని తెలుస్తోంది. ఆ గిఫ్ట్‌లను నిరాకరిస్తే పలు రకాలుగా వేధించేవారని విమర్శలున్నాయి. నిత్యానంద్ మహిళలను టార్గెట్ గా చేసుకొని వింతగా ప్రవర్తిస్తున్నారని విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment