
చంద్రయ్య కేసుపై సీఐడీ
కరీంనగర్ క్రైం : ధర్మపురి సహకార బ్యాంకులో 2013 డిసెంబర్ 21న జరిగిన చోరీలో 1,345 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీకి గురైంది.
జిల్లాలో సంచలనం సృష్టించిన కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో అనుమానాస్పద మృతి ఘటనపై ఇన్నాళ్లకు డొంక కదులుతోంది. సీఐడీ అధికారులు మూడురోజులుగా విచారణ జరుపుతుండడంతో సంఘటనకు సంబంధమున్న పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే మృతుడు సాన చంద్రయ్య తల్లిదండ్రులను విచారించి వారితోపాటు పలువురి స్టేట్‌మెంట్లు రికార్డు చేసినట్లు సమాచారం.
కరీంనగర్ క్రైం :
ధర్మపురి సహకార బ్యాంకులో 2013 డిసెంబర్ 21న జరిగిన చోరీలో 1,345 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీకి గురైంది. జనవరి 18న రాత్రి ధర్మపురి మండలం బుగ్గారానికి చెందిన సాన చంద్రయ్య(27) ఉరఫ్ చందు, దశరథ పూర్ణ, మేడిపల్లి మండలానికి చెందిన భూమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరునాడు(జనవరి 19న) రాత్రి 9.45 గంటలకు పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి కిందపడి రక్తపుగాయాలతో చంద్రయ్య కనిపించాడు. వెంటనే దర్మపురి ఎస్సై ఆధ్వర్యంలో చంద్రయ్యను కోరుట్లలోని ఓ ఆస్పత్రికి తరలించి, అక్కడినుంచి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే అతడు చనిపోయాడు.
వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు పలు రకాల కథనాలు చెప్పి సిబ్బందిని వెనకేసుకువచ్చారనే ఆరోపణలున్నాయి. చంద్రయ్యపై ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఈ సమయంలోనే చంద్రయ్య మృతి చెందాడని మానవహక్కుల సంఘం నేతలు ఆరోపించారు. మరో పక్క చంద్రయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు ఇది ప్రమాదం కాదని... జరగరానిది ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసినా అధికారులు స్పందించలేదు. సీన్ ఆఫ్ అఫెన్స్‌ను పట్టించుకోలేదు.
ఘటన ఎక్కడ జరిగిందో అక్కడ ఉండే ఎస్‌హెచ్‌వో, సీఐలు బాధ్యత వహించాల్సి ఉంటుందని నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నా.. మరోపక్క ఎమ్మెల్యేలు, ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకున్న ఉన్నతాధికారి లేరు. కంటితుడుపు చర్యగా సిరిసిల్ల డీఎస్పీ నర్సయ్యను, శాఖాపర విచారణకు పరిపాలన ఎస్పీ జనార్దన్‌రెడ్డిని విచారణాధికారులుగా నియమించి చేతులు దులుపుకున్నారు. సంఘటన జరిగిన వారం రోజులకు ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్న పోలీసు అధికారులకు ఉత్తమ సేవా అవార్డులు ఇచ్చి సన్మానించగా... చంద్రయ్య కుటుంబానికి మాత్రం ఏ న్యాయం చేయలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ధర్మపురి సీఐ, ఎస్సై జగన్‌మోహన్‌ను సాధారణ బదిలీల్లో బదిలీ చేశారే తప్ప ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నది లేదు. మిగతావారు మాత్రం ఇప్పటికీ అక్కడే విధుల్లో కొనసాగుతున్నారు. ఈ విషయమై ప్రజలు, మానవహక్కుల సంఘం నాయకులు ఆందోళనలు చేసినా ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఈ ఘటన తర్వాత కొన్నాళ్లకు కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు వేధిస్తున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వీటితోపాటు సివిల్ సెటిల్‌మెంట్లలోనూ పోలీసులు వేధిస్తున్నారని పలువురు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
నివేదికలేమయ్యాయో..
బ్యాంకు చోరీ కేసులో అనుమానితులైన చంద్రయ్య, పూర్ణ, భూమేశ్‌లపై కేసు నమోదు చేసి వారి నుంచి 25 గ్రాముల బంగారం రికవరీ చేశారు. అయితే చంద్రయ్య మృతిపై విచారణాధికారులు అసలు నివేదిక ఇచ్చారా? వాటిపై తీసుకున్న చర్యలేంటి? అనే విషయాలపై ఏ స్పష్టతా లేదు. చంద్రయ్య మృతిపై అప్పటి ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, విద్యాసాగర్‌రావు, సీహెచ్ విజయరమణారావు అసెంబ్లీలో లేవనెత్తుతామని పేర్కొన్నా.. తర్వాత విషయమే మరిచిపోయారు. వీరిలో కొందరు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా.. ఆ ఊసే ఎత్తడం లేదు. ఆదుకుంటామని, ఆర్థికసాయం చేస్తామని చెప్పిన అధికారులు మళ్లీ అటువైపు తొంగి కూడా చూడలేదు.
విచారణతో గుబులు
సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు సీఐడీ అధికారులు విచారణ మొదలెట్టడంతో ఘటనకు సంబంధం ఉన్న పోలీసు అధికారుల్లో గుబులు మొదలైంది. విచారణ నిర్వహించి న్యాయం చేయాలని చంద్రయ్య తల్లిదండ్రులతోపాటు మానవహక్కుల సంఘం నాయకులు పలుమార్లు మానవహక్కుల కమిషన్‌కు, ఇతర చోట్ల ఫిర్యాదు చేశారు.
దీంతో పూర్తిస్థాయిలో విచారించి నివేదిక అందజేయాలని సీఐడీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సదరు అధికారులు మూడు రోజులుగా ధర్మపురితోపాటు కోరుట్లలో విచారణ చేస్తున్నారు. చంద్రయ్య తల్లిదండ్రులైన నారాయణ-శంకరమ్మను కరీంనగర్ పిలిపించి విచారించి, పలువురి స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు.