
మునగాలలో నకిలీ నోట్ల చెలామణి
మునగాల, న్యూస్‌లైన్ : ఇటీవల కాలంలో మునగాలలో నకిలీ నోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నకిలీ నోట్లు ప్రత్యక్షమవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునగాల మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బెల్టు దుకాణాలు, మాంసం మార్కెట్‌లలో ఎక్కువగా ఈ నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి.
సోమవారం మునగాలలో ఓ బార్బర్ దుకాణంలో షేవింగ్ చేయించుకున్న వ్యక్తి దుకాణ యజమానికి రూ. 500నోటు ఇచ్చి మిగిలిన చిల్లర తీసుకొని వె ళ్లాడు. ఆ తర్వాత బార్బర్ దుకాణం యజమాని నోటును నిశితంగా పరిశీలించగా నకిలీదని తేలింది. దీంతో బాధితుడు బిక్కమొహం వేశాడు. విషయం బయట ఎక్కడైనా తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో నకిలీనోటును ఎలా మార్చుకోవాలనే ఆలోచనతో సతమతమవుతున్నాడు.
కాగా వారం రోజుల క్రితం ఓ వ్యక్తి రూ.50వేలు అప్పుగా తీసుకొని ఆకుపాముల ఎస్‌బీఐలో రుణం చెల్లించేందుకు వెళ్లగా అందులో రెండు రూ. 500నోట్లు నకిలీవి ఉన్నట్లు బ్యాంక్ సిబ్బంది గుర్తించి అవి చెలామణి కాకుండా అడ్డుకట్ట వేశారు. ఇదిలా ఉండగా త్వరలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పోటీ చేసే అభ్యర్థులు భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు ప్రయిత్నాలు ప్రారంభించడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.
కొంత కాలంగా మునగాలలో ఓ నకిలీ నోట్ల ముఠా సంచరిస్తుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పోలీస్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి నకిలీనోట్ల చెలామణిని అరికట్టాలని పలువురు కోరుతున్నారు.