కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానం చేసేందుకు నాగార్జున సాగర్ కాలువలోకి దిగిన ఇద్దరు నీటమునిగి మృత్యువాత పడ్డారు.
మునగాల: కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానం చేసేందుకు నాగార్జున సాగర్ కాలువలోకి దిగిన ఇద్దరు నీటమునిగి మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లా మునగాలలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో చనిపోయిన ఇద్దరూ సూర్యాపేట వాసులుగా గుర్తించారు.
నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మేకరాజు ప్రశాంత్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అతని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రశాంత్‌కు వారం కిందటే వివాహం అయింది. కార్తీకపౌర్ణమి సందర్భంగా ప్రశాంత్ కుటుంబసభ్యులు దాదాపు 11 మంది బుధవారం ఉదయం మునగాలకు చేరుకున్నారు. నాగార్జున సాగర్ ప్రధాన కాల్వలో స్నానాలు చేసి, సమీపంలోని అయ్యప్ప ఆలయంలో పూజలు చేయాలని భావించారు.
స్నానాలు చేసేందుకు సాగర్ కాలువలోకి దిగిన ప్రశాంత్, అతని మేనమామ కనపర్తి మహేష్(50) నీటి ఉధృతికి కొంతదూరం కొట్టుకుపోయారు. కేకలు వేయటంతో అక్కడే స్నానాలు చేస్తున్న అయ్యప్ప మాలధారులు వారిని రక్షించేందుకు యత్నించారు. కొద్దిసేపటికి ప్రశాంత్‌ను ఒడ్డుకు చేర్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. మహేష్ జాడ దొరకలేదు. అతని కోసం గాలిస్తున్నారు. వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.