సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి
సాక్షి, వరంగల్: పౌరసత్వ చట్ట సవరణ దేశ లౌకికవాదానికి చేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నెక్కొండ మండల కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ జిల్లా నిర్మాణ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్రంలోని మతతత్వ బీజేపీ చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టంతో లౌకిక దేశంగా పేరుగాంచిన భారత్‌కు ఇక మీదట ఆ పిలుపు దూరం కానుందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టంతో అంతరాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఈ నెల 19న కమ్యూనిస్టుల పిలుపుతో నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల అభివృద్ధిపై చిత్తశుద్ధి కనబర్చడం లేదని ఆరోపించారు. జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా మారాయని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఎక్కడా కేసీఆర్ ఎన్నిక హామీలు అమలవుతున్న దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం మత్తులో యువత చెడు సావాసలకు పాల్పడుతోందని అన్నారు. రాష్ట్ర మద్యపాన నిషేధం కోసం మహిళలు, మహిళా సంఘాలతో ఈ నెల 23న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యాలయ ముట్టడి చేపడుతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్రజావ్యతిరేక విధానాలతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు ప్రజారంజక పాలన కొనసాగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలు ఉద్యమబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా పార్టీ శ్రేణులు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, తాటిపాముల వెంకట్రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. విజయసారథి, జిల్లా కార్యదర్శి పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎం. సదాలక్ష్మీ, వీరస్వామి, అక్కపల్లి రమేష్, కందిక చెన్నకేశవులు, శంకరయ్య, సుంకరనేని నర్సయ్య, శ్రీనివాస్, ఆరెల్లి రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment