nekkonda
-
తెలంగాణ నెక్కొండ వాసికి అరుదైన అవకాశం..
వరంగల్: అత్యంత ప్రతిష్టాత్మకంగా పారిస్‌లో జరగనున్న 33వ పారా ఒలింపిక్స్ క్రీడా సమరంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించే అరుదైన అవకాశం ఉమ్మడి వరంగల్ బిడ్డకు దక్కింది. షటిల్ బ్యాడ్మింటన్ టెక్నికల్ అఫీషియల్‌గా భారతదేశం నుంచి ఇద్దరికి అవకాశం రాగా.. అందులో వరంగల్ వ్యక్తి ఒకరు కావడం విశేషం.ఆగస్టులో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (మలేషియా) పారా ఒలింపిక్స్‌లో న్యాయ నిర్ణేతలుగా పాల్గొనేందుకు భారత్ నుంచి పూణేకు చెందిన ఒకరిని నియమించగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్‌కు అవకాశం కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశ ఒలింపిక్స్ కొనసాగుతుండగానే.. రెండో దశలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.ఈ ఒలింపిక్స్‌లో కొమ్ము రాజేందర్ టెక్నికల్ అఫీషియల్స్‌గా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి తనకు అందిన ఈఅవకాశాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నానని చెబుతున్నారు ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్.గురువుల ప్రోత్సాహంతోనే..పాఠశాల స్థాయిలో ఆటల్లో నా ప్రతిభను గుర్తించి నాటి నుంచి ఒలింపిక్స్‌లో టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికవడం వరకు అడుగడుగునా గురువులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. క్రీడా గురువులు రాజశేఖర్, చెన్న కృష్ణ, సాంబయ్య, నిమ్మ మోహన్‌రావు, పి.కుమారస్వామి ఆట నేర్పిస్తే, అంపైర్‌గా రాణించేలా షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎస్.రమేశ్‌కుమార్, డాక్టర్ పి.రమేశ్‌రెడ్డి, రాష్ట్రస్థాయిలో కేసీహెచ్ పున్నయ్య చౌదరి, సుధాకర్ వేమూరి భుజం తట్టారు. – కొమ్ము రాజేందర్, ఒలింపిక్స్ టెక్నికల్ అఫీషియల్ -
ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి?
నెక్కొండ/ఎంజీఎం, వరంగల్: కొందరి ఆర్ఎంపీల వైద్యానికి నిత్యం ఏదో ఒక చోట అయాయకులు బలవుతున్నారు. తాజాగా మండలంలోని ముదిగొండకు చెందిన కావటి మణిదీప్ (10) కూడా ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరలైంది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కావటి కోటేశ్వర్, సరిత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మణిదీప్ ఇటీవల కుక్క కాటుకు గురయ్యాడు. దీంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ అశోక్.. ఈ నెల 11వ తేదీన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశాడు. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీనిపై సదరు ఆర్ఎంపీ.. గుట్టుచప్పడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రహస్య ఒప్పంద కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ విషయం వైరల్ కావడంతో తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) వెంటనే స్పందించి సుమోటోగా స్వీకరించింది. దీంతో వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ బృందానికి జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని చైర్మన్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య సోమవారం ఆదేశించారు.కాగా, వరంగల్ టీజీఎంసీ సభ్యుడు శేషుమాధవ్, టీజీఎంసీ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్‌కుమార్, రాష్ట్ర ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి, వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ అన్వర్‌మియా, వరంగల్ హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు కొలిపాక వెంకటస్వామి, తానా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాకేశ్ నేతృత్వంలోని వైద్య బృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనుందని ఆదేశాల్లో పేర్కొంది. -
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. వారంలో రెండో ఘటన
సాక్షి, వరంగల్: హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. వరంగల్ జిల్లా నెక్కొండ సమీపంలో సోమవారం ఉదయం 12 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో పొగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు.. చెయిన్ లాగి రైలును ఆపారు. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో భయందోళన చెందిన ట్రైన్ దిగి పరుగులు పెట్టారు. రైలులోని డ్రైవర్లు, గార్డు పరిస్థితిని సమీక్షించి.. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున పొగలు బోగీలను కమ్మేశాయి. కాగా బ్రేక్ లైనర్లు పట్టుకోవడంతో పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇక హౌరా ఎక్స్‌ప్రెస్ లో పొగలు రావడం వారం వ్యవధిలో ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం కొరివి మండలం గుండ్రాతిమడుగు వద్ద కూడా రైలుతో పొగలు వ్యాపించాయి. చదవండి: చక్రం తిప్పడం పక్కా.. ఈ బరువు నాకొక లెక్కా -
చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరిముక్క
సాక్షి, వరంగల్: పది నెలల తమ కుమారుడు ఏడుస్తున్నాడని కొబ్బరి ముక్క చేతిలో పెట్టాడు తండ్రి.. కానీ, ఆ కొబ్బరి ముక్క.. ఆ బుడిబుడి మాటల బాలుడి ప్రాణాలు తీసింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోలు శివారు వెంకటతండా జీపి పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తండా వాసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన దరావత్ కవిత–మాలు దంపతులు. మాలు అయ్యప్ప స్వామి మాలధారణ చేశాడు. కాగా, అయ్యప్ప పూజ కార్యక్రమంలో తల్లిదండ్రులు నిమగ్నమై ఉండగా.. తమ కుమారుడు మణికంఠ(10నెలలు) ఏడుస్తుండడంతో కొబ్బరిముక్క ఇచ్చారు. కొబ్బరిముక్క బాబు గొంతులో ఇరుక్కొపొయి నోటి నుంచి నురుగు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నెక్కొండకు తీసుకువస్తున్న క్రమంలో ఊపిరిఆడక బాలుడు మృతి చెందాడు. చదవండి: నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు.. -
అక్క ప్రేమ వ్యవహారంలో చెల్లెలి జోక్యం.. అవమానంతో..
సాక్షి, నెక్కొండ(వరంగల్): అక్క ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కూతురును తల్లిదండ్రులు నిలదీయడం.. అనంతరం జరిగిన గొడవతో అవమానం భరించలేక చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై సీమాఫర్హీన్ తెలిపిన వివరాల ప్రకారం... నెక్కొండ రజక వాడకు చెందిన అమృత మండల కేంద్రానికి చెందిన జహీర్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలోపడింది. ఈనెల 5న చెల్లెలు అంజలి(15)తో కలిసి జహీర్ ఇంటికి వెళ్లి ప్రేమ, పెళ్లి విషయమై అతడిని నిలదీశారు. జహీర్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు వారిని దుర్భాషలాడి, అవమానించి వెళ్లగొట్టారు. దీంతో అవమాన భారంతో ఇంటికి వచ్చిన బాలికలను తల్లిదండ్రులు సైతం నిలదీశారు. శనివారం రాత్రి ఇది కాస్త గొడవకు దారి తీయడంతో అంజలి బహిర్భూమికి వెళ్తానంటూ బయటకు వచ్చి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విలపిస్తూ బావి వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. చదవండి: గత కొన్నేళ్లుగా భార్య సాగిస్తున్న నిర్వాకం.. అనారోగ్యం పాలైన భర్త! బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు నర్సంపేట అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామునబాలిక మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలి తండ్రి రామానుజం(అంజి) ఫిర్యాదు మేరకు అక్క ప్రియుడు జహీర్‌తోపాటు అతడి తండ్రి జమాల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: రెండేళ్లుగా ప్రేమ.. ప్రియురాలు లేని లోకం వద్దని.. -
టీకా వేసుకున్న రోజే భార్య.. ఆ తర్వాత భర్త
నెక్కొండ: జ్వరంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. అక్కడే టీకా కూడా వేయించుకున్నారు. అదే రోజు భార్య మృతి చెందగా, ఐదో రోజు భర్త మరణించాడు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నెక్కొండకు చెందిన పుట్టపాక అంజమ్మ (58), వెంకటయ్య (67) దంపతులు ఈనెల 19న స్థానిక పీహెచ్‌సీకి కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్లారు. అదే సెంటర్లో కరోనా టీకా సైతం తీసుకున్నారు. కాగా, అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై అంజమ్మ మృతి చెందింది. అప్పటినుంచి జ్వరంతో బాధపడుతూ, మనోవేదనకు గురైన భర్త వెంకటయ్య శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. టీకా కోసం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్ వేయడంతోనే వృద్ధ దంపతులు మృతిచెందారని గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమేశ్‌ను వివరణ కోరగా, వృద్ధాప్యంలో వచ్చే హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెంది ఉండవచ్చనని అభిప్రాయపడ్డారు. చదవండి: విషాదం.. దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే చదవండి: వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువే -
ప్రియుడి మోజులో భర్త హత్య
సాక్షి, నెక్కొండ: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిందో మహిళ. శవాన్ని కాల్చి.. బూడిదను చెరువు లో కలిపి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండలో జరిగింది. సీఐ తిరుమల్ కథనం ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి శివారు గేటుపల్లికి చెందిన బాదావత్ ధర్యావత్ సింగ్ (42), జ్యోతి దంప తులకు ఇద్దరు సంతానం. సింగ్ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తుండగా.. జ్యోతి స్థానికంగా టైలరింగ్ శిక్షణ ఇస్తోంది. ఈ క్రమంలో మండలంలోని అప్పల్‌రావుపేటకు చెందిన సాంబరాజుతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు ఈ విషయం భర్త సింగ్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి ధర్యావత్ సింగ్ ఇంట్లోనే ఉంటుండటంతో జ్యోతికి సాంబరాజును కలవడం సాధ్యం కావడం లేదు. ఎప్పటికైనా ఈ సమస్య ఎదురవుతుందని భావించిన ఆమె.. భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ప్రియుడితో కలసి పథకం పన్నింది. హత్య, ఆపై దహనం ఈనెల 14న రాత్రి మద్యం మత్తులో ఉన్న భర్తను హతమార్చేం దుకు ఇదే సరైన సమయమని భావించిన జ్యోతి.. సాంబరాజుకు సమాచారం ఇచ్చింది. దీంతో అతను ట్రాలీ ఆటోలో నెక్కొండకు వచ్చాడు. తాడును సింగ్ మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం తన పత్తి చేను వద్దకు మృతదేహాన్ని తరలించాడు. అప్పటికే అక్కడ ఉన్న సాంబరాజు తండ్రి యాకయ్య, సోదరుడు సురేశ్ సాయంతో శవాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా శవం సగమే కాలింది. దీంతో మళ్లీ దహనం చేశారు. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు 16న బూడిద, అస్థికలను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం దర్గా చెరువులో కలిపారు. గుట్టురట్టు చేసిన కాల్‌డేటా.. మృతుడి సోదరుడు వీరన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జ్యోతి కదలికలపై నిఘా పెట్టి.. ఆమె సెల్‌ఫోన్ కాల్‌డేటా ను సేకరించారు. సాంబరాజుతో మాట్లాడిన సంభాషణల ఆధారంగా జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సాంబరాజు, జ్యోతిని అరెస్టు చేశారు. సాంబరాజు తండ్రి యాకయ్య, సోదరుడు సురేశ్ పరారీలో ఉన్నారు. -
‘పౌర’ సవరణ లౌకికవాదానికి చేటు
సాక్షి, వరంగల్: పౌరసత్వ చట్ట సవరణ దేశ లౌకికవాదానికి చేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నెక్కొండ మండల కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ జిల్లా నిర్మాణ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్రంలోని మతతత్వ బీజేపీ చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టంతో లౌకిక దేశంగా పేరుగాంచిన భారత్‌కు ఇక మీదట ఆ పిలుపు దూరం కానుందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టంతో అంతరాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఈ నెల 19న కమ్యూనిస్టుల పిలుపుతో నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల అభివృద్ధిపై చిత్తశుద్ధి కనబర్చడం లేదని ఆరోపించారు. జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా మారాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడా కేసీఆర్ ఎన్నిక హామీలు అమలవుతున్న దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం మత్తులో యువత చెడు సావాసలకు పాల్పడుతోందని అన్నారు. రాష్ట్ర మద్యపాన నిషేధం కోసం మహిళలు, మహిళా సంఘాలతో ఈ నెల 23న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యాలయ ముట్టడి చేపడుతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్రజావ్యతిరేక విధానాలతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు ప్రజారంజక పాలన కొనసాగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలు ఉద్యమబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా పార్టీ శ్రేణులు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, తాటిపాముల వెంకట్రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. విజయసారథి, జిల్లా కార్యదర్శి పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎం. సదాలక్ష్మీ, వీరస్వామి, అక్కపల్లి రమేష్, కందిక చెన్నకేశవులు, శంకరయ్య, సుంకరనేని నర్సయ్య, శ్రీనివాస్, ఆరెల్లి రవి పాల్గొన్నారు. -
మంచానికి కట్టేసి.. నిప్పంటించి..
నెక్కొండ: భూ వివాదం ఓ వృద్ధ దంపతుల పాలిట శాపంగా మారింది. చనిపోయాక చితికి నిప్పంటించాల్సిన కొడుకు బతికుండగానే కాల్చి చంపాడు. తల్లిదండ్రులను మంచానికి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కన్నవారు అని కూడా కనికరించని ఆ కిరాతకుడు తన కొడుకుతో కలసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. హృదయ విదారకమైన ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భూక్యా దస్రు (68)కు 10 ఎకరాలు భూమి ఉండగా.. కుమారులు కేతూరాంకు 3.30 ఎకరాలు, వీరన్నకు నాలుగెకరాలు పంచి ఇచ్చాడు. తన వద్ద రెండున్నర ఎకరాల భూమి ఉంచుకున్నాడు. వీరన్న కొంతకాలం క్రితం మరణించగా దస్రు తన వద్ద ఉన్న భూమిని వీరన్న భార్య పేరిట పట్టా చేసేందుకు పూనుకున్నాడు.ఈ క్రమంలో తల్లిదండ్రుల పట్ల కక్ష పెంచుకున్న కేతూరాం, అతడి కుమారుడు వెంకన్న.. బుధవారం సాయంత్రం వృద్ధ దంపతులను మంచానికి కట్టేసి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వారిపై పోసి నిప్పంటించారు. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న నెక్కొండ పోలీసులు గ్రామస్తులతో కలసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంచం మీద ఉన్న వృద్ధ దంపతుల మృతదేహాలు అస్తిపంజరాలుగా మారగా.. కేతూరాం, వెంకన్నకు సైతం గాయాలయ్యాయి. వారు నెక్కొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మెజార్టీలో ‘రోల్ మోడల్’ గా నిలవాలి
సాక్షి, నెక్కొండ: మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే ప్రతీ ఒక్కరు ఈ ఎన్నికలో మెజార్టీలోనూ ‘రోల్ మోడల్’ గా నిలవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ప్రచారంలో భాగంగా నెక్కొండ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలకంటే పది రెట్లు ఎక్కువ మెజార్టీ సాధించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండడంతో చేయి చాచి ఆశించే దుర్భర స్థితిలో ఉండగా.. ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలు జత కట్టనున్నాయని.. ఇక, జాతీయ పార్టీలకు చుక్కెదురు కాక తప్పదని పేర్కొన్నారు. సొంత మండలంలాంటి నెక్కొండను దత్తత తీసుకుంటానని, ఇందుకు మండలంలో 70 శాతం ఓట్లు కారు గుర్తుకే పడాలని మంత్రి షరతు పెట్టారు. ఇందుకు ప్రజల నుంచి స్పందన రావడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా కలిసొస్తే కేసీఆర్ ప్రధానమంత్రిగా ఉండొచ్చని జోస్యం చెప్పారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జడ్పీ కో–ఆప్షన్ సభ్యులు అబ్దుల్నబీ, నుస్రత్తస్వీర్, వైస్ ఎంపీపీ సారంగపాణి, పార్టీ మండల అధ్యక్షుడు సోమయ్య, నెక్కొండ సొసైటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, నాయకులు కొమ్ము రమేష్, చల్లా శ్రీపాల్‌రెడ్డి, సురేష్, హరికిషన్, శివకుమార్, బాలాజీనాయక్ పాల్గొన్నారు. -
‘జనరల్ విద్యార్థులకూ గురుకులాలు’
సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్రంలో విద్యావవస్థను గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సరైన సదుపాయాలు కల్పిస్తే మన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని పేర్కొన్నారు. జిల్లాలోని నెక్కొండ గురుకుల పాఠశాలలో ఆయన మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం మంచి మెనూ తయారు చేసిందని అన్నారు. ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లల ఆరోగ్యం కోసం.. ఒక్కో విద్యార్థినికి 1600 రూపాయల చొప్పున ఖర్చు చేసి 6 లక్షల మందికి హెల్త్, హైజనిక్ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాల బాలికల విద్యావృద్థికి తెలంగాణలో 53 గురుకులాలను ప్రారంభించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు జనరల్ కేటగిరీ విద్యార్థులకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని అన్నారు. -
మొక్కలే అతడి ప్రాణం..
నెక్కొండ: మండలంలోని పెద్దకొర్పోలు గ్రామానికి చెందిన ఓ వన ప్రేమికుడు అనువుగాని చోట పెరుగుతున్న చెట్లను సంరక్షిస్తున్నాడు. వివరాలలోకి వెళ్తే... గ్రామానికి చెందిన పరుపాటి ఇంద్రసేనారెడ్డికి చెట్లంటే ప్రాణం. ఈ మేరకు అనువుగాని చోటైన తాటి చెట్ల కొమ్మల్లో పెరుగుతున్న చెట్లకు ప్రాణం పోస్తున్నాడీ వనప్రేమికుడు. పాము చంద్రయ్య, అమ్మ వెంకన్నల సహాయంతో 20 చెట్లను వేర్లతో తీసి అనువైన ప్రదేశాలలో నాటేందుకు సిద్ధపడ్డాడు. అందులో భాగంగానే గ్రామంలోని ప్రధాన వీధుల వెంట, కస్తూర్భాగాంధీ గురుకులం, ప్రభుత్వం పాఠశాల ఆవరణ, పంచాయతీ కార్యాలయాలలో నాటించారు. ఆయన కృషిని గుర్తించిన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం
నెక్కొండ : ఎలాంటి సంబంధం లేని ఓ బాలిక అన్నదమ్ముల గొడవలో ప్రాణాలు కోల్పోయిన బాలిక కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేస్తామని జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీఓ) మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బంజరుపల్లి శివారు ధర్మతండాలో ఈ నెల 30న రాళ్లు విసరడంతో అదే తండాకు చెందిన బాలిక అఖిల మృతిపై జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న మరుసటి రోజు ఎంజీఎం ఆస్పత్రిలో నెక్కొండ సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై నవీన్‌కుమార్‌లను కలిసి వివరాలు తీసుకున్నట్లు మహేందర్‌రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబ నేపథ్యం ప్రకారం.. వారి ఆర్థిక విషయాలపై గొవడకు కారణం, బాలిక మృతిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర విచారణ రిపోర్టును మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు, జిల్లా ఉన్నతాధికారులు, బాలల సంక్షేమ కమిటీకి పంపనున్నట్లు ఆయన తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు నాలుగో సంతా నం కాగా, పదో తరగతి చదివిన పెద్ద కూతురు(మూగ)కు పునరావాసం కల్పిస్తామన్నారు. ఆమెను వృత్తి విద్యా కోర్సు చదివించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రెండో కుమార్తెకు వివాహం జరుగగా, మూడో కుమార్తెను నెక్కొండ కస్తూర్భా గురుకులంలో 8వ తరగతిలో చేర్పిస్తామన్నారు. ప్రభుత్వం తరుఫున బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విచారణలో అంగన్వాడీ టీచర్ సుధ, ఆయా పూలమ్మ, తండావాసులు పాల్గొన్నారు. -
పారిపోయిన బాలుడిని చేరదీసిన రైల్వే టీటీఈలు
సాక్షి, వరంగల్: హాస్టల్ నుంచి పారిపోయి వచ్చిన బాలుడిని వరంగల్ సీటీఐ అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటన వరంగల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన మేడబోయిన సాయి(13) రెడ్యాలలోని హాస్టల్లో ఉంటూ ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం తన స్నేహితుడైన దీక్షకుంట్ల గ్రామానికి చెందిన అజయ్‌తో కలిసి హాస్టల్ నుంచి పారిపోయి వచ్చి వరంగల్ స్టేషన్లో స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ ఎస్-4 బోగీలో ఎక్కాడు. అజయ్ మాత్రం వరంగల్ స్టేషన్లోనే ఉండిపోయాడు. రైలు బల్లార్షా చేరుకుంటుండగా రైలులోని టీటీఈలు బి.మాధవరావు, ఎస్.శ్రీనివాస్‌లు అతడిని చేరదీశారు. అక్కడినుంచి వారు ఆ బాలుడిని మంగళవారం మరో రైలులో వరంగల్ స్టేషన్‌కు తీసుకొచ్చి అతని కుటుంబీకులకు అప్పగించినట్లు సీటీఐ శ్రీనివాస్‌రావు వివరించారు. ఈ సందర్బంగా ఆయన టీటీఐలు మాధవరావు, శ్రీనివాస్‌లను అభినందించారు. -
భార్య కాపురానికి రావడం లేదని..
నెక్కొండ (వరంగల్) : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి దూకుతానని బెదిరిస్తున్న సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండలో సోమవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన వీరన్న(29)కు ఎనిమిదేళ్ల క్రితం తిమ్మాపురం గ్రామానికి చెందిన మహేశ్వరి(25)తో వివాహమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరన్న మద్యానికి బానిసై భార్యను వేధింపులకు గురిచేస్తుండటంతో.. మూడు నెలల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన వీరన్న సోమవారం సాయంత్రం తన ఇంటి ముందు ఉన్న రిలయన్స్ టవర్ ఎక్కి అక్కడి నుంచి దూకుతానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని కిందకు దించడానికి యత్నిస్తున్నారు. -
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు నెక్కొండలో హాల్ట్
విజయవాడ, న్యూస్‌లైన్: ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే పద్మావతి ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12764/12763)కు వరంగల్ జిల్లా నెక్కొండలో హాల్ట్ కల్పిస్తున్నట్లు విజయవాడ సీనియర్ పీఆర్వో మైకేల్ శుక్రవారం తెలిపారు. ఈ రైలు నెక్కొండకు రాత్రి 8.55కి చేరి 8.56కి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి 1.56కి వచ్చి 1.57కి బయలుదేరుతుంది. ఈ మార్పు శనివారం నుంచి ఆరు నెలలపాటు అమల్లో ఉంటుందన్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు మహబూబాబాద్‌లో హాల్ట్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12728/12727)ను వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ఒక నిమిషం పాటు నిలుపుతారు. ఈ ట్రైన్ మహబూబాబాద్‌కు రాత్రి 8.32కి చేరి 8.33కి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి 1.54కి వచ్చి 1.55కి బయలుదేరుతుంది. ఈ మార్పు శని వారం నుంచి ఆరు నెలలపాటు అమలులో ఉంటుంది. -
బాలికపై ముగ్గురు బాలుర అత్యాచారం
-
బాలికపై ముగ్గురు బాలుర అత్యాచారం
రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన తగాదాలు కక్షగా మారి అది చివరకు ఓ బాలిక అత్యాచారానికి గురైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో స్థానికంగా నివాసం ఉంటున్న ఇరు కుటుంబాల మధ్య తగాదాలు ఉండటంతో.... ఒక కుటుంబానికి చెందిన పిల్లలు... మరొక కుటుంబం వారిని ఎలాగైనా అభాసుపాలు చేయాలని పథకం వేశారు. ఆ కుటుంబంలోని అమ్మాయితో స్నేహాన్ని నటిస్తూ, ఆమెను మభ్యపెట్టి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేస్తుండగా మిగిలినవారు ఆ ఘటనను సెల్ఫోన్లలో కూడా చిత్రీకరించారు. అనంతరం సెల్ ఫోన్లలో స్నేహితులకు పంపిస్తున్న విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక డీఎస్పీ సరిత మాట్లాడుతూ నిందితులపై నిర్బయ, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.