నెక్కొండలొ జరిగిన ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు
సాక్షి, నెక్కొండ: మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే ప్రతీ ఒక్కరు ఈ ఎన్నికలో మెజార్టీలోనూ ‘రోల్ మోడల్’ గా నిలవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ప్రచారంలో భాగంగా నెక్కొండ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలకంటే పది రెట్లు ఎక్కువ మెజార్టీ సాధించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండడంతో చేయి చాచి ఆశించే దుర్భర స్థితిలో ఉండగా.. ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ప్రాంతీయ పార్టీలు జత కట్టనున్నాయని.. ఇక, జాతీయ పార్టీలకు చుక్కెదురు కాక తప్పదని పేర్కొన్నారు. సొంత మండలంలాంటి నెక్కొండను దత్తత తీసుకుంటానని, ఇందుకు మండలంలో 70 శాతం ఓట్లు కారు గుర్తుకే పడాలని మంత్రి షరతు పెట్టారు. ఇందుకు ప్రజల నుంచి స్పందన రావడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అన్ని విధాలుగా కలిసొస్తే కేసీఆర్ ప్రధానమంత్రిగా ఉండొచ్చని జోస్యం చెప్పారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జడ్పీ కో–ఆప్షన్ సభ్యులు అబ్దుల్‌నబీ, నుస్రత్‌తస్వీర్, వైస్ ఎంపీపీ సారంగపాణి, పార్టీ మండల అధ్యక్షుడు సోమయ్య, నెక్కొండ సొసైటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, నాయకులు కొమ్ము రమేష్, చల్లా శ్రీపాల్‌రెడ్డి, సురేష్, హరికిషన్, శివకుమార్, బాలాజీనాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment