సీకేఎంలో శిశుమార్పిడి వివాదం
- ఆస్పత్రిలో కలకలం
- పోలీసుల రంగప్రవేశం
- అధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
ఎంజీఎం : వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రిలో ఓ గర్భిణీకి పుట్టిన శిశువు మరో గర్భిణీ బంధుమిత్రులు తీసుకోవడం ఆందోళనకు తెర తీసింది. దీంతో సదరు గర్భిణీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తమ బిడ్డకు పుట్టిన శిశువు ఏదీ.. పుట్టింది ఆడపిల్లనా.. మగపిల్లవాడా ఎలా తెలిసేది... డీఎన్‌ఎ పరీక్ష చేయించి నిర్ధారించాలంటూ పెద్డఎత్తున ఆందోళనకు దిగిన సంఘటన మంగళవారం జరిగింది. ఆత్మకూరు మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన తిరుపతి భార్య సరితకు నగరంలోని సీకేఎం ఆస్పత్రిలో అత్యవసర పరిస్థతుల్లో శస్త్రచికిత్స(సెక్షన్) చేసి ప్రసవం చేశారు. ప్రసవంలో మగశిశువు పుట్టాడని పేర్కొని సదరు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
శిశువు జన్మించిన క్రమంలో కొద్దిపాటి అస్వస్థతతో ఉండడంతో నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో ఉంచాలని చెప్పారు. దీంతో శిశువును పిల్లల వైద్యుడికి అప్పగించి ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. అనంతరం అరగంట తర్వాత పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామానికి చెందిన ఆనంద్ భార్య ఉమకు శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. ఆమె పుట్టిన శిశువును అప్పగించేందుకు ఉమకు సంబంధించిన ఆటెండెంట్లను పిలిచారు. ఈ క్రమంలో వేరే గర్భిణీకి చెందిన అటెండెంట్ వచ్చి తీసుకెళ్లి శిశువును పిల్లల వైద్యుడికి అప్పగించడంతో నవజాత శిశు సంరక్షణ కేంద్రం లోని వార్మర్ ద్వారా వైద్యచికిత్సలు అందిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఉమకు సంబంధించిన బంధువులు ఆపరేషన్ థియేటర్ వద్ద అందుబాటులో లేరు.
మరో 15 నిమిషాల తర్వాత ఉమను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో బంధుమిత్రులు అక్కడికి చేరుకున్నారు. శిశువు ఎక్కడ అనిప్రశ్నించడంతో ఒక్కసారిగా అంద రు ఉలిక్కిపడ్డారు. శిశువును మీ బంధువులకే అప్పగించాం కదా అన్ని వైద్యులు పేర్కొనడం తో వివాదం మొదలైంది. తామెవరం ఇక్కడ లేమని, శిశువును తమకు అప్పగించలేదని ఆందోళనకు దిగారు. దీంతో వైద్యులు వెంటనే స్పందించి శిశువు ఎస్‌ఎన్‌సీయూలో ఉన్న విషయాన్ని గుర్తించి ఆడ పిల్ల పుట్టిందని ఉమ బంధువులకు తెలిపారు. అయితే తమకు ఆడపిల్ల పుట్టడమేమిటని, నమ్మకం లేదని బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. డీఎన్‌ఏ పరీక్ష చేరుుస్తే తప్ప అసలు విషయం వెలుగులోకి రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ బంధువులు తమ శిశువు మాయం చేశారని పోలీసులను కూడా ఆశ్రయించారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి వైద్యుల వద్ద వివరాలు సేకరించారు.
అధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
శిశువు మార్పిడి జరిగిందనే వివాదంపై వెంట నే సీకేఎం ఆస్పత్రి పరిపాలనాధికారులు స్పం దించడంతో వివాదం సద్దుమణిగింది. శిశువు జన్మించగానే కాళ్లకు ట్యాగ్‌లాంటి స్టకర్ వేస్తామని, బరువుతోపాటు కాళ్ల వేలిముద్రలను కేస్ షీట్‌పై తీసుకుంటామని సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాలను ఉమ కుటుంబ సభ్యులకు వివరించి వారికి పుట్టిన పాపను ధృవీకరించడం జరిగిందన్నారు. ప్రస్తు తం ఇద్దరు గర్భిణీలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు, శిశువులను కూడా నవజాతు శిశుసంరక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆర్‌ఎంఓ పుష్పెందర్‌నాథ్ పేర్కొన్నారు.