* కొత్తగూడెం రీజియన్‌లో 63 శాతం మంది హాజరు..
* కార్పొరేట్‌లో 220 మంది గైర్హాజరు
* కొనసాగిన ఆందోళనలు, అరెస్టులు
కొత్తగూడెం : సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఐదురోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలో విస్తరించి ఉన్న నాలుగు ఏరియాల్లో రెండోరోజైన బుధవారం పాక్షికంగానే కొనసాగింది. రీజియన్ వ్యాప్తంగా నాలుగు ఏరియాల్లో కలిపి రెండు షిఫ్ట్‌లలో 63 శాతం కార్మికులు విధుల్లో పాల్గొన్నారు. ముందస్తు అరెస్టులు, నిరసనగా ఆందోళనలు కొనసాగాయి.
కొత్తగూడెం ఏరియాలో విధులకు వెళ్లే కార్మికులను అడ్డుకునేందుకు యత్నించిన 15 మంది ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ నాయకులను టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అరెస్టులకు నిరసనగా నాయకులు స్థానిక సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌తో పాటు సమ్మెకు పిలుపునిచ్చిన హెచ్‌ఎంఎస్ కూడా విధులకు హాజరవుతూ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు ఆరోపించారు. ఇల్లెందులో జీఎం కార్యాలయం ఎదుట జేఏసీ నాయకులు ధర్నా చేశారు. మణుగూరు ఏరియాలో జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న 70 మంది జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
63 శాతం హాజరైన కార్మికులు..
జిల్లాలోని కొత్తగూడెం రీజియన్ పరిధిలో నాలుగు ఏరియాల్లో రెండోరోజు మొదటి రెండు షిఫ్టులలో 63 శాతం కార్మికులు విధులకు హాజరయ్యారు. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో 1710 మంది కార్మికోద్యోగులకుగాను 1311 మంది హాజరుకాగా 179 మంది సెలవులో ఉన్నారు. మిగతా 220 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు కార్పొరేట్ పరిధిలో గైర్హాజరు లేనప్పటికీ రెండోరోజు కొంతమంది ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడం గమనార్హం.
కొత్తగూడెం ఏరియా పరిధిలో 3241 మంది కార్మికులకుగాను 1709 మంది హాజరయ్యారు. 185 మంది సెలవులో ఉండగా 1347 మంది విధులకు హాజరుకాలేదు. ఇల్లందు ఏరియాలో 1379 మంది కార్మికులకు గాను 585 మంది విధుల్లో పాల్గొన్నారు. మరో 50 మంది సెలవులో ఉండగా 744 మంది గైర్హాజరయ్యారు. మణుగూరు ఏరియాలో 2405 మంది కార్మికులకుగాను 1297 మంది విధుల్లో పాల్గొనగా 160 మంది సెలవులో ఉన్నారు. 948 మంది గైర్హాజరయ్యారు.
మొదటిరోజు 95.3 శాతం ఉత్పత్తి..
సమ్మె ప్రారంభమైన మంగళవారం కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు ఏరియాలలో 95.3 శాతం ఉత్పత్తి నమోదైంది. మూడు ఏరియాల్లో 72,600 టన్నుల లక్ష్యానికి గాను 69,220 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. కొత్తగూడెం ఏరియా అత్యధికంగా 24,518 టన్నులకు 25,448 టన్నులు, ఇల్లందు ఏరియాలో 19,340 టన్నులకు 17,677 టన్నులు, మణుగూరు ఏరియాలో 28742 టన్నులకు 26,095 టన్నుల ఉత్పత్తి నమోదైంది. కాగా మొదటి షిఫ్టునకు హాజరైన కార్మికులను రెండో షిఫ్టులో సైతం కొనసాగిస్తూ యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి చేయించిందని కార్మిక సంఘాలు అంటున్నాయి.
సింగరేణిలో ప్రశాంతంగా సమ్మె
Published Thu, Jan 8 2015 4:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement