మొదటి వారంలో జిల్లాకు సీఎం..!
నిర్మల్, జైపూర్‌లలో పర్యటన
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్చి మొదటి వారంలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం మార్చి 1 నుంచి శ్రీకారం చుట్టాలని భావిస్తున్న బీడీ కార్మికుల జీవన భృతి పథకాన్ని.. మొదటివారంలో జిల్లాలోని నిర్మల్‌లో ప్రారంభించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పలు జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సీఎం పర్యటన ఖరారు విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది.
జిల్లాలో సుమారు 68 మంది బీడీ కార్మికులున్నారు. వీరికి ప్రతినెలా రూ.వెయ్యి భృతి చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఈ పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమైంది. ఎంపీడీవోలు, వీఆర్‌వోలు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. ఈ పథకాన్ని తన నియోజకవర్గంలో ప్రారంభించాలని రాష్ట్ర న్యాయ, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. నిర్మల్‌తోపాటు, నిజామాబాద్ జిల్లాలో కూడా ఒకేరోజు సీఎం పర్యటన ఉండే అవకాశాలున్నాయి.
జైపూర్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన..?
సింగరేణి నిర్మిస్తున్న జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడో యూనిట్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సింగరేణి అధికారులు ఇప్పటి నుంచే సీఎం పర్యటన ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బహిరంగ సభా స్థలాన్ని చదును చేస్తున్నారు. ఇక్కడ 600 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యల్లో భాగంగా ఇక్కడ మరో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడో యూనిట్‌ను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. 2014 డిసెంబర్ 25న ఈ పవర్ ప్లాంటును కూడా సందర్శించారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకే రోజు ఉంటాయా? వేర్వేరు రోజుల్లో జిల్లాలో పర్యటిస్తారా.. అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.